Sankranti special trains: సంక్రాంతి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు..!!
Sankranti special trains: సంక్రాంతి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు..!!
Trains: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ అవసరం లేకుండా విశాఖపట్నం–విజయవాడ మధ్య 12 జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ జన సాధారణ్ రైళ్లు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం వంటి కీలక స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రయాణికులకు భారీగా ఉపశమనం లభించనుంది.
జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఈ 12 జన సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని SCR స్పష్టం చేసింది. సాధారణ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లలో ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేకపోవడంతో చివరి నిమిషంలో ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.
పండుగ వేళ రహదారి మార్గాల్లోనూ, ఇతర రైళ్లలోనూ రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసిన రైల్వే అధికారులు, ప్రయాణికుల భద్రతతో పాటు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణికులు రైళ్ల సమయాలు, వివరాల కోసం సమీప రైల్వే స్టేషన్లను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.