CM Chandrababu: చంద్రబాబు మార్క్ గవర్నెన్స్: అమరావతి నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చేరాలని, పాలనలో పారదర్శకత ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొని జిల్లాల వారీగా పురోగతిని వివరించారు.
టెక్నాలజీతో పాలన.. ఏఐ టూల్స్ వినియోగం!
పాలనలో అత్యాధునిక సాంకేతికతను జోడించడమే లక్ష్యంగా సీఎం పలు సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా పది సూత్రాల అమలు, జీఎస్‌డీపీ వృద్ధిరేటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేశామని, మరో రెండేళ్లలో ఇక్కడి నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ (Artificial Intelligence), డేటా సెంటర్లతో పాలనలో పెనుమార్పులు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షలే ప్రగతికి సోపానాలు
గత ప్రభుత్వ తీరును ప్రస్తావిస్తూ.. గతంలో కలెక్టర్ల సదస్సులు నిర్వహించే వారు కాదని, ఇప్పుడు మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ భేటీ, అధికారుల నెలవారీ సమీక్షలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలని సూచించారు.
గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
ప్రపంచం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులు వేస్తోందని, రాష్ట్రం కూడా ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం పేర్కొన్నారు. పీపీపీ (PPP) ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.