జనంతో పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు - సోము వీర్రాజు

*టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్‌నే అడగండి

Update: 2022-05-09 07:39 GMT

జనంతో పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు - సోము వీర్రాజు

Andhra Pardesh: ఏపీలో పొత్తు రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పొత్తుల వ్యాఖ్యలు, వాటికి పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు కాషాయ నేతల్ని చికాకు పెడుతోంది. ఇవాళ కాకపోతే రేపు పవన్ కళ్యాణ్ తమకు గుడ్ బై చెప్పడం ఖాయమనే అంచనాకు బీజేపీ నేతలు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఇవాళ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందంటూ దాదాపుగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్న సంకేతాలు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీలో అసహనం పెంచుతున్నాయి. ఈ విషయం ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో బహిర్గతమైంది.

వచ్చే ఎన్నికలకు చేసుకునే పొత్తులపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చేశారు. 2024 ఎన్నికల్లో జనంతో పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు అంటూ సోము వీర్రాజు బాంబు పేల్చారు. 2024లో బీజేపీదే అధికారమని ఆయన వెల్లడించారు. టీడీపీతో కలుస్తాడా లేదా అన్నది పవనే చెప్పాలంటూ ఆయన మరో డిమాండ్ కూడా చేశారు.

మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ యత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏపీ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నానని పవన్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News