ఇసుక కొరత తో కార్మికులకు ఉపాధి కష్టాలు

ఒక వైపు కరోనా.. మరో వైపు ఇసుక కొరత కూలీలను కష్టకాలంలోకి నట్టేస్తుంది.

Update: 2020-06-06 10:50 GMT
File Photo

ఒక వైపు కరోనా.. మరో వైపు ఇసుక కొరత కూలీలను కష్టకాలంలోకి నట్టేస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మాణ రంగం విస్తరించిన విశాఖ జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన నిర్మాణాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే, సరిపడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, రానున్న వర్షాకాలంలో ఎలా వుంటుందోనని కూలీలతో పాటు బిల్డర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

విశాఖ జిల్లాలో ఇసుక కొరతతో కూలీలు.. బిల్డర్లకు ఇబ్బందులు తప్పటం లేదు. మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావంతో భవన నిర్మాణ పనులు నిలిపి వేశారు బిల్డర్లు. ఇటీవల ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంతో పనులు మొదలు పెట్టినా..ఇసుక కొరత ఇబ్బందులకు గురిచేస్తుంది.

జిల్లాలోని ముడసర్లోవ, ఆగనంపూడి, నక్కపల్లి, అనకాపల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, చోడవరం, భీమిలిలో ఇసుక యార్డులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఇసుక సరఫరా జరుగుతోంది. అయితే విశాఖపట్నంలో ముడసర్లోవ, అగనంపూడికి ఇసుక సరఫరాకు లారీ యజమానులు, డ్రైవర్లు మొగ్గు చూపుతున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపుతో నిర్మాణ పనులు ప్రారంభించాలనుకున్నామని..ఇసుక అందుబాటులో లేకపోవడంతో మొదలుపెట్టలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు సైతం ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో ఇసుక కొరత ఉండడంతో కూలీ పనులు లేక పూట గడవడమే చాలా ఇబ్బందిగా ఉందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.

జిల్లాలో నిర్మిస్తున్న భవనాలు..ఇతర అవసరాలకు నెలకు 30 నుంచి 40 వేల టన్నుల ఇసుక పడుతుంది. గట్టిగా వర్షాలు ప్రారంభమయ్యేలోపు మిగిలిన ఇసుక విశాఖపట్నం రావాలంటే రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు వందల లారీలను వినియోగించాలి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో వందల లారీల ఇసుక లభ్యతపై సందిగ్ధత నెలకొంది.

Full View


Tags:    

Similar News