పాస్ ఉంటేనే పర్మిషన్ : ఏపీ సరిహద్దు వద్ద నిలిపేస్తున్న అధికారులు

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇంకా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూనే ఉంది.

Update: 2020-06-11 03:55 GMT
EPass Checking at AP Border

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇంకా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూనే ఉంది. పాస్ ఉంటేనే రాష్ట్రం లోపలకు అనుమతిస్తూ చర్యలు తీసుకుంటోంది. సమీప రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రం కావడంతో ఈ చర్యలు చేపడుతోంది. అయితే ఈ పద్ధతి వల్ల ఎక్కువ మంది ఏపీలోకి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా ప్రజలకు ప్రయాణ కష్టాలు మాత్రం తీరడం లేదు. సరిహద్దుల్లో ఈ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వచ్చేవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టంచేసింది. అయితే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఒక్కోచోట ఒక్కో రకమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు, రైలు, విమానం.. ఇలా ఏ మార్గంలో వచ్చినా 'స్పందన' ద్వారా ఈ-పాస్‌ తీసుకుంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు తేల్చిచెబుతున్నారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తత సమయంలో ప్రయాణాలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే కఠిన నిబంధనలు విధిస్తున్నామని పేర్కొంటున్నారు. మరోవైపు రోడ్డుమార్గంలో రాష్ట్రంలోకి వచ్చేవారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేసి, చేతిపై స్టాంప్‌ వేసి సెల్ఫ్‌ క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ఆస్పత్రి క్వారంటైన్‌కు లేకపోతే 14 రోజుల హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధునాతన ఐమాస్క్‌ క్వారంటైన్‌ మొబైల్‌ బస్సుల ద్వారా 2నిమిషాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అత్యాధునిక శాంపిల్‌ కలెక్షన్‌ బస్సులను విజయవాడ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌తో పాటు గరికపాడు చెక్‌పోస్టు వద్ద కూడా అందుబాటులో ఉంచారు.

రోడ్డుమార్గంలో ఇలా...

రాష్ట్రం లోపల ప్రజా రవాణా సంస్థ బస్సులతో పాటు సొంత వాహనాల్లో వెళ్లొచ్చు. అయితే సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి.బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌కే వెళ్లాలి తప్ప మధ్యలో బస్సెక్కడం కుదరదు. బస్సులు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడంలేదు. సొంత వాహనాల్లో వెళ్లొచ్చు. తిరిగి రావాలంటే మాత్రం ఈ-పాస్‌ ఉండాల్సిందే.

రైళ్లలో ప్రయాణించాలంటే...

టికెట్‌ రిజర్వేషన్‌ ఉన్న మాత్రమే రైల్వేస్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారిని రైలు ఎక్కనివ్వరు. వారికి టికెట్‌ డబ్బు పూర్తిగా రీఫండ్‌ ఇస్తారు. కనీసం గంటన్నర ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. మాస్క్‌ ధరించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించి, లక్షణాలు లేకుంటేనే ప్రయాణానికి అనుమతించడంతో పాటు క్వారంటైన్‌ స్టాంప్‌ వేస్తారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే ఆహారం తెచ్చుకోవాలి.

విమాన ప్రయాణాలు ఇలా..

ఇంటివద్దే బోర్డింగ్‌ పాస్‌ ప్రింట్‌ తీసుకుని విమానాశ్రయానికి రెండు గంటల ముందు చేరుకోవాలి. ఆరోగ్యసేతు యాప్‌ ఉండాలి. అందులో గ్రీన్‌ స్టేటస్‌ ఉంటేనే లోపలికి అనుమతి. ఏదైనా కారణాల వల్ల అనుమతించకపోతే ప్రయాణ తేదీ మారుస్తారు. లేదా డబ్బు వాపసు చెల్లిస్తారు.

Tags:    

Similar News