Vizag: వేసవి తాపానికి చెక్.. నగరం అంతటా చలివేంద్రాలు గ్రీన్ షెల్టర్లు!

Vizag: విశాఖపట్నంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్'పై సమీక్ష నిర్వహించారు.

Update: 2026-04-08 15:46 GMT

Vizag: వేసవి తాపానికి చెక్.. నగరం అంతటా చలివేంద్రాలు గ్రీన్ షెల్టర్లు!

Vizag: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ఉన్న 10 జోన్లలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని జివిఎంసి అదనపు కమిషనర్ పి. నల్లనయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ సమావేశ మందిరంలో హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్ పై జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యు సి డి) , కార్యదర్శి బి.వి. రమణ, మంచినీటి విభాగం పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు, జోనల్ కమిషనర్లు, ఎస్ ఆర్ యు టీమ్ సభ్యులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీవో లు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచనల మేరకు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వడగాలులను ఎదుర్కొనేందుకు, వేసవి తాపానికి ప్రజలు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సంవత్సరం వేసవి తీవ్రత పెరుగుతుందని వృద్ధులు, పిల్లలు ,అనారోగ్య సమస్యలతో ఉన్నవారు అత్యవసరమైతే తప్ప వేసవికాలంలో బయటకు రావద్దని సూచించారు. ఇందుకు అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నగరంలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని జీవీఎంసీ ఏర్పాటుచేసిన చలివేంద్రాలలో తాగునీరుతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జీవీఎంసీ యంత్రాంగాన్ని సంప్రదిస్తే చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని స్వచ్ఛంద సంస్థల వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో చల్లని మజ్జిగ పంపిణీ,మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పై , వడదెబ్బ తగిలిన మనిషికి ప్రథమ చికిత్స చేయు విధానంపై ప్రజలలో అవగాహన కల్పిస్తే ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చు అన్నారు.

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉదయం 5:30 నుండి 10:30 వరకు సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని, అలాగే భవన యజమానులు భవన నిర్మాణ కార్మికులకు వారు పనిచేసిన చోట చల్లని తాగునీరు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. పక్షులు, పశువులు రక్షణ దిశగా నీటి తొట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ లో చైర్మన్ గా జీవీఎంసీ కమిషనర్, కార్యదర్శిగా అదనపు కమిషనర్ (పబ్లిక్ హెల్త్) ఇతర అధికారులు కమిటీ మెంబర్లగా ఉంటారని అదనపు కమిషనర్ నల్లనయ్య తెలిపారు.

జీవీఎంసీ ఏర్పాటు చేసే చలివేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తామని, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే వారికి ఓవర్ ప్యాకెట్లు అందిస్తామని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి తెలిపారు. నీటి విలువలను తెలుసుకొని వేసవిలో త్రాగునీరు వృధా కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ (యు సి డి) బి.వి. రమణ సూచించారు.

ప్రస్తుతం జలాశయాలలో జులై వరకు సరిపడినంత నీరు సమృద్ధిగా ఉందని ప్రతి ఇంటికి 100 లీటర్లు పైగా తాగునీరు అందిస్తున్నామని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పర్యవేక్షక ఇంజనీరు ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరు జోనల్ కమిషనర్లు, సహాయక వైద్యాధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు,జె ఆర్ నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధులు కె . ఎస్.ఆర్.మూర్తి, స్వచ్చ విశాఖ అంబాసిడర్ డి.ఎస్. ఆనంద్, గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి జేవి రత్నం, పలు స్వచ్చంద సంస్థ లు, నివాసిత సంక్షేమ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News