104 వాహనాల్లో కోవిడ్ శాంపిల్స్ సేకరణ.. సీఎం జగన్ నిర్దేశం

కరోనా నియంత్రణకు పటిష్ఠమైన వ్యూహం అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Update: 2020-06-22 15:42 GMT

కరోనా నియంత్రణకు పటిష్ఠమైన వ్యూహం అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్‌, పరీక్షలు నిర్వహించాలని, మండలానికి ఒక 104 వాహనం వినియోగించుకోవాలని సీఎం నిర్దేశించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. నెలకోసారి 104 ద్వారా వైద్య సేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలన్నారు.

కరోనా పరీక్షలు చేయడంలో హేతుబద్ధత ఉండాలని జగన్ అధికారులకు సూచించారు. 50 శాతం కంటైన్మెంట్‌ క్లస్టర్లలోని వారికి పరీక్షలు చేయాలి. మిగిలిన 50 శాతంలో కొవిడ్‌ పరీక్షలకు ముందుకొచ్చేవారికి చేయాలి. కాల్‌ సెంటర్‌ ద్వారా సమాచారం ఇచ్చే వారికి పరీక్షలు చేయాలి. వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉన్న రంగాలు, గ్రూపుల్లో పరీక్షలు చేయాలి. ప్రజల్లో భయాందోళనలు తొలిగేలా అవగాహన, చైతన్యం కల్పించాలి.. మధుమేహం, బీపీ లాంటి వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించాలి. బాధితులకు వెంటనే మందులు ఇవ్వాలి.పరీక్షల తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కొవిడ్‌ వ్యాప్తి అడ్డుకోగలం. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. కొవిడ్‌ పరీక్షలు చేయడంలో స్పష్టమైన వ్యూహం అమలు చేయాలని సీఎం అన్నారు. 

Tags:    

Similar News