AP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూపర్ హిట్ సభతో వివాదాలకు ఫుల్‌స్టాప్?
ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన అనంత తమ్ముళ్లలో సుపర్ హిట్ సభ కొత్తజోష్ ను నింపిందా...?
AP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూపర్ హిట్ సభతో వివాదాలకు ఫుల్‌స్టాప్?
ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన అనంత తమ్ముళ్లలో సుపర్ హిట్ సభ కొత్తజోష్ ను నింపిందా...? అనంత టీడీపీలో నెలకొన్న వివాదాలకు ఇక ఫుల్‌స్టాప్ పడినట్లేనా..? అధిష్టానం ఆదేశాలతో అంతా సర్ధుకుపోతున్నారా....? వివాదాలకు కేంద్రంగా మారిన అనంతపురం నియోజకవర్గ టీడీపీలో సభ ఎలాంటి మార్పు తెచ్చింది...? దీనిపై తెలుగు తమ్ముళ్ల స్పందన ఏంటి..?
ఊహించని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డిపై ఘన విజయం సాధించారు. అంతకు ముందు రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్ అనూహ్యంగా అనంతపురం టీడీపీ టికెట్ దక్కించుకొని ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్లు.. దిగ్గజ నేతలను కాదని దగ్గుపాటికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడాన్ని మొదట సీనియర్లు వ్యతిరేకించినా ఎన్నికల్లో కలిసి పనిచేశారు. యువ ఎమ్మెల్యేగా నిత్యం నియోజకవర్గంలో కలియతిరుగుతూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ వస్తూన్నారు. ఐతే ఎన్నికల అనంతం ఆయనను పలు వివాదాలు చుట్టుముట్టాయి. పలువురు సీనియర్ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీలో ముందు నుంచి క్రియాశీలకంగా పనిచేసిన నేతలు, సీనియర్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే తన మార్క్ రాజకీయం చేసుకుంటూ వెళుతున్నారు. కలిసి వచ్చే వారితో ముందుకు సాగుతూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పలు సమస్యలు, వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయట.
ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎక్స్ ఖాతా నుంచి వివాదాస్పద పోస్టులు వెలువడ్డాయి. అవి సోషియల్ మీడియాలో ప్రచారం కావడం.. .అందులో వివాదాస్పద వాఖ్యలు ఉండడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వాటిని ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో తాను విజయవాడలో ఉన్నానని... తన ఎక్స్ ఖాతాను రాజకీయ ప్రత్యర్థులు, గిట్టనివారు హ్యాక్ చేశారని మండిపడ్డారు. వెంటనే అతని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. అంతకు ముందు జూనియర్ ఎన్ టీఆర్ సినిమా విడుదల సందర్భంగానూ వివాదాస్పద వాఖ్యలు చేశారు అన్న ఆడియో వైరల్ గా మారింది. అది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దూమారాన్నే రేపింది. అది తన వాయిస్ కాదని... కవాలని ఎవరో ఇలా చేస్తూన్నారని వెంటనే ఎమ్మెల్యే ఖండించారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూండడంపై ఎమ్మెల్యే ప్రసాద్ పలు మార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తన పై రాజకీయ కుట్ర జరుగుతోందని.. కావాలని సమస్యలు సృష్టిస్తూన్నారని చెబుతూన్నారు.
దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయాలకు కొత్తకాకపోయినా.. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రం కావడం... ఉన్నతాధికారులు, ప్రముఖులు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు అంతా ఇక్కడే ఉంటున్నారు. నగరవాసులు, ఎక్కువ మంది చదువుకున్న వారు ఉన్న నియోజకవర్గం ఇది. అనంతపురం నగరంతో పాటు నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్ కాలనీ, అనంతపురం పంచాయతీలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గతంలో రాప్తాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయాలకు కొత్తకాకపోయినా... అనంతపురం రాజకీయాల్లోకి మొన్నటి సాధారణ ఎన్నికలతో వచ్చారు. ఎన్నికల సమయంలోనూ... ఎన్నికల అనంతరం అనేక వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలతో మమేకమై రాజకీయం చేస్తూన్నా... నగరంలో ఎమ్మెల్యే కేంద్రంగా పలు ఆరోపణలు, వివాదాలు ఏర్పడ్డాయి. ఐతే వాటితో తనకు సంబంధం లేదని... కావాలని తన రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటివి సృష్టిస్తూన్నారని ప్రసాద్ చెబుతూ వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు కలిసివచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తూన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దాదాపు ఐదు హామీలు నెరవేరడంతో సెప్టెంబర్ 10న అనంతపురంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభను నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సభ నిర్వహించడం స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటికి కలిసి వచ్చిందట. సుమారు 15 రోజులు సభ ఎర్పాట్లను పర్యవేక్షిండంతో పాటు అనంతపురంకు తరలి వచ్చిన మంత్రులు, రాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటూ నిర్వహణలో పాలు పంచుకోవడం ఆయనకు బాగా కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సభ నిర్వహణలో అధిష్టానం అండగా నిలవడం... తోటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్ల లోపాలు పంచుకోవడం ఆయనకు సానుకూలంగా మారిందట. సూపర్ హిట్ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ సహా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తరలిరావడం... సభ సూపర్ హిట్ కావడంతో అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ కు అధిష్టానం నుంచి అభినందనలు వెలువడ్డాయట.
పార్టీలో క్రియాశీలక నేతలు, ప్రముఖులతో సాన్నిహిత్యం పెరగడం ఎమ్మెల్యే దగ్గుపాటికి కలిసి వస్తోందట. సూపర్ హిట్ సభ అనంతరం నియోజకవర్గంలో చాలా మంది నేతలు తమతో కలిసి వస్తూన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. చూడాలి అనంతపురం
రాజకీయాలు మున్ముందు ఏ విధంగా ఉంటాయో... తమ్ముళ్ల మధ్య సఖ్యత ఎంతకాలం కొనసాగుతుందో... ఎలాంటి ఎత్తుగడలతో ఎమ్మెల్యే దగ్గుపాటి ముందుకు వెళుతారో...?