ఉద్యోగులతో ఏపీ సచివాలయం కళకళ
లాక్‌డౌన్ సడలింపులతో ఏపీ సచివాలయం ఉద్యోగులతో గురువారం కళకళలాడింది.
లాక్‌డౌన్ సడలింపులతో ఏపీ సచివాలయం ఉద్యోగులతో గురువారం కళకళలాడింది. రాష్ట్ర సీఎస్ సాహ్ని ఇచ్చిన ఆదేశాలతో ఉద్యోగులందరూ తిరిగి తమ విధులకు హాజరయ్యారు. విజయవాడ, గుంటూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో కొందరు ఉద్యోగులు సచివాలయానికి చేరుకోగా.. మరికొందరు సొంత వాహనాల్లో వచ్చారు. రెండు నెలల తర్వాత ఉద్యోగులు తమ శాఖల విభాగాలకు చేరుకున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఉద్యోగీ మాస్క్ ధరించి విధులకు హాజరయ్యారు. మొదటి రోజు దాదాపు 70 శాతం మంది విధులకు హాజరయ్యారు. ప్రతి బ్లాక్ వద్ద థర్మల్ స్కానర్లతో అందరి శరీర ఉష్ణోగ్రత పరీక్షించాకే లోపలికి అనుమతించారు. ఉద్యోగుల పని ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా 400 మంది ఉద్యోగులు హైదరాబాద్‌లోఉండిపోయారని, వారిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దాదాపు 70 శాతం ఉద్యోగులు హాజరు కావడంతో రెండు నెలలపాటు స్తంభించింన సచివాలయంలోని ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి పుంజుకొనున్నాయి.