APSRTC: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు

APSRTC: దసరా వచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు గుళ్లవుతున్నాయి.

Update: 2021-10-07 10:11 GMT

APSRTC: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు

APSRTC: దసరా వచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు గుళ్లవుతున్నాయి. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా స్పెషల్ బస్సుల పేరుతో ఛార్జీలు వసులు చేస్తోంది APSRTC. ఒకవైపు బస్సు ఖాళీగా వెళ్తుందనే వంకతో అమాంతం రేట్లు పెంచింది. దీంతో సామాన్యుడిపై దసరా సెలవులకు బస్సు ప్రయాణం భారంగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది APSRTC. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా దసరా పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారికి, విజయవాడ దుర్గమ్మ దర్శనం అందరికీ అందేలా చేసేందుకు ప్రత్యేక బస్సులు వేశారు. అయితే ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఛార్జీలు పెంచడం సరికాదంటున్నారు.

సామాన్యుడు ఆధారపడేది బస్సు మీదే. చాలా మంది సెలవులు అనగానే ఇళ్లకు వెళ్లడానికి వీటినే ఆశ్రయిస్తుంటారు. ఒకవైపు ప్రైవేటు బస్సుల టికెట్ల ధరలు పెంచకూడదని అధికారులే చెబుతున్నారు‌‌‌. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచుతోందని ప్రయాణికులు అంటున్నారు.

అయితే స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓ వైపు బస్సు ఖాళీగా వెళ్తుందని కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం పెంచుతున్నామని వెల్లడించారు. ఏదేమైనా దసరాకు బస్సు ఆక్యుపెన్సీ ఆధారంగా ఆర్టీసీ బాదుడు సామాన్యుడికి భారంగా మారిందని ప్రయాణికులు అంటున్నారు‌.

Tags:    

Similar News