Burning Topic: ట్రంప్‌కు బిగ్‌షాక్.. అధ్యక్ష పదవినుంచి తొలగిస్తారా..?

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష పదవి గండం పొంచి ఉందా? ఇరాన్‌తో యుద్ధం మరియు వివాదాస్పద నిర్ణయాల వల్ల 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయనను తొలగిస్తారా?

Update: 2026-04-07 01:52 GMT

Burning Topic: ట్రంప్‌కు బిగ్‌షాక్.. అధ్యక్ష పదవినుంచి తొలగిస్తారా..?

Burning Topic: అమెరికా రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఇరాన్‌‌ను సర్వనాశనం చేసేదాకా తగ్గేదే లే అని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ చేయడం అమెరికన్లకు అంతగా రుచించడం లేదు. ట్రంప్ దుందుడుకు వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు డెమోక్రాట్లనే కాకుండా రిపబ్లికన్లను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ పదవీ గండం తప్పదేమోనన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రయోజనాల కోసమేనంటున్నారు. హార్ముజ్ జలసంధిని తెరిపించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని వాన్స్ సమర్థిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రేకింగ్ న్యూస్‌లో నిలిచారు. ట్రంప్‌నకు పదవీ గండం పొంచి ఉందనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా రీసౌండ్ చేస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు, వివాదాస్పద నిర్ణయాలు, సైనిక అధికారుల తొలగింపు, ఇతర దుందుడుకు చర్యలే ఇందుకు కారణమనే చర్చ జోరుగా సాగుతోంది. యుద్ధ వైఫల్యాలు, అగ్ర దేశ భద్రతపై ఆందోళనలతో చట్టసభ్యులు టంప్‌ను పదవి నుంచి తొలగించే ప్రతిపాదనలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇరాన్‌పై దూకుడు వైఖరి, 48 గంటల గడువు, మిడిల్ ఈస్ట్‌లో పెరిగిన ఉద్రిక్తతలు ట్రంప్‌‌నకు చట్టపరమైన, రాజకీయ సమస్యలను తెచ్చిపెట్టాయంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్ వివాదంలో డొనాల్డ్ ట్రంప్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిలిటరీలోని అత్యున్నత అధికారులను తొలగిస్తున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం త్వరగా ముగియకపోతే రాబోయే మధ్యంతర ఎన్నికల్లో పార్టీకి, అధ్యక్షుడికి భారీ నష్టం తప్పదంటున్నారు. 25వ సవరణ లేదా మహాభియోగం ద్వారా పదవీ గండం పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతమంది చట్టసభ్యులు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్ తన మొదటి టర్మ్‌లో లాగానే ఇప్పుడు కూడా వివాదాస్పద నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పకతప్పదు.

సర్వసాధారణంగా ఎన్నికల ఫలితాలపై పందాలు కాసే ‘కాల్సి’ వంటి ప్రిడిక్షన్ మార్కెట్లలో ఇప్పుడు ట్రంప్ పదవి కోల్పోవడంపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయట. డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారా? అనే ప్రశ్నకు ‘అవును’ అని పందెం కాసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందట. గణాంకాల ప్రకారం.. గత నెలలో ఈ అవకాశం 28.6 శాతంగా ఉండగా, తాజాగా అది 35.1 శాతానికి పైగా పెరిగిందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. యుద్ధ భయం, దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ఇన్వెస్టర్లు, పందెంరాయుళ్లు ట్రంప్ పదవి గండంపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారన్న వార్తలు రీసౌండ్ చేస్తున్నాయి. పదవీ గండం పొంచి ఉందన్న వార్తలు ట్రంప్ పరిపాలనపై ప్రజల్లోనూ, మార్కెట్లలోనూ నెలకొన్న అపనమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది.

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం, ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేరని భావిస్తే, వైస్ ప్రెసిడెంట్ సహా కేబినెట్ మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రంప్ వ్యవహారశైలిని గమనిస్తున్న విశ్లేషకులు, ఈ సవరణను ప్రయోగించే అవకాశం లేకపోలేదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వానికి ట్రంప్ పదేపదే ఇస్తున్న అల్టిమేటంలు, వార్నింగ్‌లు.. స్వదేశంలో కీలక వ్యవస్థలపై చేస్తున్న వ్యాఖ్యలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇరాన్ యుద్ధం మరింత ముదిరితే, దేశ ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్‌ను గద్దె దించే ప్రక్రియ వేగవంతం కావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ముప్పేట భీకర దాడులు ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌ సైన్యం ఎక్కడా తగ్గకుండా శక్తిమేరకు పోరాడుతోంది. ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌పై స్వదేశం అమెరికాలో అసంతృప్తి జ్వాలలు రెట్టింపయ్యాయట. ఇరాన్‌పై యుద్ధాన్ని స్వయంగా అమెరికన్లు వ్యతిరేకించడం చర్చనీయాంశం. ఈ యుద్ధాన్ని త్వరగా ముగించకపోతే మధ్యంతర ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న వార్తలు ఈపాటికే కోడై కూస్తున్నాయి. అయినా తగ్గేదే లే అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ఇరాన్‌ను ఎలాగైనా లొంగదీసుకోవడానికి అమెరికా సైన్యం వనరులు సమకూర్చుకుంటోంది. తమ సైన్యాన్ని, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరో ఆరు నెలలకుపైగానే.. అంటే సెప్టెంబర్‌ దాకా కొనసాగే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఇరాన్‌ తలవంచడం ఖాయమని అంతా భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సీన్ మరొకటి.

 అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రంప్‌ రెండేళ్ల పాలన పూర్తి కావడానికి ముందు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఈ ఎన్నికలపై పెను ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ అనవసరంగా ఈ యుద్ధం తెచ్చిపెట్టారన్న అభిప్రాయం అమెరికాలో వ్యక్తమవుతోందట. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని ముక్తకంఠంతో చెబుతున్నారు అమెరికన్లు. ఈ స్వరంలో ట్రంప్‌ సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా స్వరం కలుపుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్‌ పార్టీలో చీలిక కనిపిస్తోంది. ట్రంప్‌ను వ్యతిరేకించేవారు అంతకంతకూ ఎక్కువవుతున్నారు. యుద్ధం కారణంగా.. అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ అంశం కూడా ట్రంప్ మెడకు చుట్టుకోనుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మధ్యంతర ఎన్నికలను ట్రంప్ ఎదుర్కోవడం కష్టమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ తప్పుకోవాలన్న డిమాండ్లు సొంత పార్టీ రిపబ్లికన్‌లోనే వినిపించే ప్రమాదం పొంచి ఉంది. అది ఒకవేళ ఈ వ్యతిరేకత ప్రజా ఉద్యమంగా మారితే ట్రంప్‌ మధ్యలోనే దిగిపోక తప్పదని విశ్లేషకుల వాదనగా ఉంది.


Full View


Tags:    

Similar News