Burning Topic: ముగుస్తున్న ట్రంప్ డెడ్ లైన్..ఇరాన్‌కు మరో భారీ షాక్!

Burning Topic: ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తోంది! హర్ముజ్ జలసంధిని తెరవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరిక.

Update: 2026-04-07 01:59 GMT

Burning Topic: ముగుస్తున్న ట్రంప్ డెడ్ లైన్..ఇరాన్‌కు మరో భారీ షాక్!

Burning Topic: పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ యుద్ధం ఇరాన్ నియంత్రణలోని హర్ముజ్ జలసంధి చుట్టూనే కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి. ఈ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ విధించిన గడువును తాజాగా పొడిగించారు. అయితే అమెరికా ప్రతిపాదించే ఎటువంటి షరతులకు, విధించే ఎటువంటి హెచ్చరికలకు తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ద్వార కొనసాగే బిజినెస్‌లో వాటా ఇవ్వమని ఇరాన్ మెలిక పెట్టింది. లేదంటే..

ఎర్ర సముద్రంలోని మరో జలసంధిని టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. చూడాలి.. ఈ యుద్ధ వాతావరణం మరెన్ని రోజులు కొనసాగుతుందో..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌‌‌కు అమెరికా ఇచ్చిన గడువు మరో 24 గంటల్లోనే ముగియనుంది. దీంతో రాజీ ఫార్ములా తెరపైకొచ్చింది. అయితే అమెరికా ప్రతిపాదించే ఎటువంటి మధ్యవర్తిత్వానికి తలొగ్గేదే లేదనంటోంది ఇరాన్ ప్రభుత్వం. దీంతో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ వ్యూహాత్మక వైఖరిని అనుసరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామన్న స్పష్టమైన హామీ ఇస్తేనే దౌత్యపరమైన చర్చలకు ముందుకెళ్తామని భారత్‌లో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీ తేల్చి చెప్పారు. మరోవైపు ఈ యుద్ధంలో కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై రాజీకి ఇరాన్ నిరాకరించడం శాంతి చర్చలకు ఒక పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు.

కాల్పుల విరమణ ప్రతిపాదన చర్చల దశలో ఉన్నప్పటికీ, ఒత్తిడికి తలొగ్గి తొందరపడరాదని ఇరాన్ డిసైడ్ అయ్యింది. సుస్థిర శాంతికి హామీ ఇవ్వని స్వల్పకాలిక చర్యల విషయంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. యుద్ధం, కాల్పుల విరమణ, చర్చలు, మళ్లీ సంఘర్షణ అనే రూపంలో కొనసాగే చర్చలతో మాకు చాలా చేదు అనుభవం ఉందని ఇరాన్ బహిరంగంగానే చెబుతోంది. కాబట్టి, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలికంగా ఉద్రిక్తతలను తగ్గించడంపై మాత్రమే దృష్టి సారించే ఒప్పందాలను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. మొత్తమ్మీద పశ్చిమాసియాలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులుగా హర్మూ‌జ్‌ జలసంధి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్టు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో అమెరికా కూడా శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధంగా లేదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇలా ఉండగా.. హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.హర్ముజ్‌ను తెరవడానికి.. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను తమ దేశానికి ఇవ్వాలని ఇరాన్ కొత్త కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. ఇరాన్‌ను నాశనం చేయాలని ఉబలాట పడితే ట్రంప్‌నకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. అంతేకాక ఎర్ర సముద్రంలోని మరో కీలక జలసంధిని కూడా టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగానే పశ్చిమాసియాలో అమెరికా చర్యలు ఉంటున్నాయన్నారు ఇరాన్ నేత ఘలిబఫ్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటలు విని గల్ఫ్ ప్రాంతాన్ని ట్రంప్ తగలబెడుతున్నారని ఘలిబఫ్ మండిపడ్డారు. యుద్ధ నేరాల ద్వారా ట్రంప్ సాధించేది ఏమీ లేదన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించి, యుద్ధాన్ని ముగించడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతునే ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ అధికరికంగా ధృవీకరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌ అధిపతి.. విద్యావంతుడు, శక్తివంతుడైన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ.. అమెరికన్-జియోనిస్టు శత్రువుల నేరపూరిత ఉగ్రదాడిలో వీరమరణం పొందారని ఐఆర్‌జీసీ తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్టు చేసింది. ఐఆర్‌జీసీ చీఫ్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు రిపోర్టు చేస్తారు. సుమారు 50 ఏళ్లపాటు సేవలు అందిచిన ఖదేమీ.. గూఢచర్యం, సెక్యూరిటీ సర్వీసుల్లో కీలక పాత్ర పోషించారు. ఖదేమీ మరణం ఐఆర్‌జీసీ వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత నెలలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఇదే సమయంలో ఎస్లాంషార్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ నిరాకరించిన నేపథ్యంలో.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేదు.


Full View

 

Tags:    

Similar News