Off The Record: కేసీఆర్ సైలెంట్ స్ట్రాటజీ! బీఆర్ఎస్ బిగ్ షో ఎక్కడ?
Off The Record: ఏప్రిల్ 27న బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సస్పెన్స్! కేసీఆర్ ప్లీనరీ ఎక్కడ నిర్వహించబోతున్నారు?
Off The Record: కేసీఆర్ సైలెంట్ స్ట్రాటజీ! బీఆర్ఎస్ బిగ్ షో ఎక్కడ?
Off The Record: రేవంత్ సర్కార్ తప్పిదాలపై గులాబీ బాణాన్ని ఎక్కుపెట్టడమే కాక పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచే లక్ష్యంగా ప్లీనరీ ఏర్పాటు చేయబోతున్నారు కేసీఆర్. ఇంతకీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ ఎక్కడ నిర్వహించనుంది? తెలంగాణ భవన్‌లోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారా? హైద్రాబాద్ నగరం చుట్టూ ఏదో ఒక ప్రదేశంలో వేదికను సిద్ధం చేస్తారా? గులాబీ బాస్‌కు సెంటిమెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారా? ఇంతకీ పార్టీ ఆవిర్భావ వేడుకలపై నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం ఏప్రిల్ 27. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ప్లీనరీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆ పార్టీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డిసైడ్ అయ్యారు. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఎక్కడ జరుపబోతున్నారు అనే దానిపై ఇప్పుడు నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత ఏడాది 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ సభను ఓరుగల్లు వేదికగా నిర్వహించారు. ఆ తర్వాత సంవత్సరం పొడుగునా ప్రతీ ఉమ్మడి జిల్లాలో సంబరాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. కానీ ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా సంబరాలు చేయలేదని బిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈసారి ఏప్రిల్ 27న సంబరాలు హైదరాబాదులో నిర్వహించనున్నారా? జిల్లాల్లో నిర్వహిస్తారా? లేదంటే తెలంగాణలో భవన్లోనే సంబరాలు ముగిస్తారా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జోరందుకుంది. గత సంవత్సరం కమిటీలు వేసి ప్లీనరీ నిర్వహించే నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదన్న టాక్ వినిపిస్తోంది. అందులోభాగంగా ఇప్పటివరకు ఎలాంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించలేదని సమాచారం. పార్టీ సభ్యత్వ కార్యక్రమం పూర్తయితేనే పూర్తిస్థాయిలో కమిటీలు వేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కేడర్, నేతల్లో నైరాశ్యం నెలకొందన్న టాక్ లేకపోలేదు. 2024 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్.. చేదు ఫలితాలను చవిచూసింది. ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సుమారు 12 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సైతం ఓటమి చెందడంతో బీఆర్ఎస్ కేడర్‌లో నిరుత్సాహం నెలకొందట. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయిందనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందట అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మొదట్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని గులాబీ బాస్ కేసీఆర్ చెప్పినప్పటికీ.. రెండున్నరేళ్ళు అవుతున్నప్పటికీ ఆయన ఫామ్ హౌస్ వీడి బయటకు రాకపోవడంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొందట. అడపాదడపా ఫాంహౌస్‌కు పార్టీ నేతలను పిలిపించుకుని కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కేసీఆర్ బయటికి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితేనే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
ఇలాఉంటే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ నిర్వహించాలనే దానిపై కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక క్లారిటీ రానుందట. నిజానికి పదేళ్లు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అధిష్టానం సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదనీ స్వయంగా కేటీఆర్ ఒప్పుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత గతేడాది ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను నిర్వహించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ నిర్వహించిన ఈ సభలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిజానికి ఈ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఒక రకంగా ఈ సభ విజయవంతం అయిందన్న టాక్ బిహిరంగంగానే వినిపించింది. అయితే ఆనాటి సిల్వర్ జూబ్లీ సభ.. బీఆర్ఎస్‌లో కుదుపునకు కారణమైందట. ఈ సభ తర్వాత బీఆర్ఎస్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయట. దీంతో ఈ ఏడాది పార్టీ వ్యవస్థాపక దినోత్సవం హంగూఆర్భాటాల మధ్ నిర్వహిస్తారా లేక తెలంగాణ భవన్‌లోనే మమ అనిపిస్తారా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారని సమాచారం. అయితే ఆరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయనున్నారన్నది తేలాల్సి ఉంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జెండా ఆవిష్కరణ కోసం తెలంగాణ భవన్ వస్తారా లేక ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోనే జెండా ఆవిష్కరణ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందట. ఏదిఏమైనా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాల షెడ్యూల్ ఏంటనేది మాత్రం.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చాకే తేలనుందట. అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనుందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.