Off The Record: బీజేపీ లో ఒంటరైన ఈటల..టార్గెట్ చేసింది ఎవరు?

Off The Record: తెలంగాణ బీజేపీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు! ఎంపీ ఈటల రాజేందర్‌ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారా?

Update: 2026-04-07 01:38 GMT

Off The Record: బీజేపీ లో ఒంటరైన ఈటల..టార్గెట్ చేసింది ఎవరు?

Off The Record: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? కొత్త-పాత అనే అంతర్గత పోరుతో ఆ ఎంపీ సతమతమవుతున్నారా?

ఒకప్పుడు “నా నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలే లేవు”అని గర్వంగా చెప్పిన ఆ ఎంపీ.. ఇప్పుడు అదే గ్రూప్ రాజకీయాలకు బలవుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇమేజ్ సంపాదించుకున్న ఆ నాయకుడు.. పార్టీ లోపల ఒంటరయ్యారా? పార్టీ రాష్ట్ర కార్యాలయానికి దూరమయ్యారా? లేక దూరమయ్యేలా చేస్తున్నారా? ఆ ఎంపీని ఇబ్బందులకు గురిచేస్తోన్న నేతలెవరూ? ఇంతకీ ఎవరా ఎంపీ?

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కొత్త, పాత నేతల మధ్య అంతర్గత కొట్లాటలు ఇంకా చల్లారలేదా? అంతర్గత పోరుకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం చేయడం లేదా? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ వర్గ విభేదాలతో విసిగిపోతున్నారా? ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌లో 20 ఏళ్లు పనిచేసి, ఆ పార్టీలో తనకి జరిగిన అవమానభారంతో బీజేపీ గూటికి చేరారు ఈటెల. మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అన్నీ సవ్యంగా సాగుతున్నట్టే కనిపించినా.. ఎంపీగా గెలిచిన తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తన సొంత నియోజకవర్గం.. హుజురాబాద్‌కే తనని రానీయకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఈటల. గ‌త కొన్నిరోజులుగా పార్టీలో కొందరు నేతల తీరు పట్ల ఆయన గుర్రుగా ఉంటున్నారట.

ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో ఈటల వర్గాల మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో నడుస్తోంది. ఇద్దరు నేతలు పరస్పరం పరోక్ష విమర్శలు చేసుకోవడం సహజంగా మారింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈటల.. తన కార్యకర్తలను దించి నియోజకవర్గంలో 29 మంది సర్పంచులను గెలిపించుకున్నారు. ఈ విషయంలో బండి వర్గానికి, ఈటల వర్గానికి కొంత రభస జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు నాయకుల మధ్య వైరం తమకు అన్యాయం చేసిందని.. ఒక వర్గంపై మరో వర్గం బాహాటంగా విమర్శలు చేయడం కూడా తెలిసిందే. ఈమధ్య జరిగిన హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈటలను రానివ్వకుండా దూరం చేసి, పార్టీ మాకు అన్యాయం చేసిందన్న ఆరోపణలు ఈటల అనుచరుల నుంచి వినిపించడం పెద్ద రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌తో తనకున్న పాతికేళ్ల అనుబంధం వదులుకోవాలా? ఇదేం రాజకీయాలు అంటూ ఈటల లోలోపల మదనపడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇలా ఉంటే ఈటల.. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తిరిగి సొంతగూటికే చేరుతున్నారంటూ ఆ వార్తల సారాంశం. ఈ ప్రచారానికి ఈటల స్వయంగా తెరదించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్‌‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధంతో సహజంగానే గులాబీ నాయకులతో పరిచయాలు ఉంటాయని, వారితో మంచీచెడు మాట్లాడితే తప్పేం ఉందని ఎదురు ప్రశ్నించారు ఈటల. మనోవేదనకు గురిచేసిన బీఆర్‌ఎస్‌లోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదన్నారు ఈటల. ఇలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ప్రతి నిత్యం వస్తూ అధికార పార్టీని నిలదీసే ఈటల.. ఈమద్య ఎందుకు ముఖం చాటేస్తున్నారన్న చర్చ జోరందుకుంది. కొత్త, పాత నాయకుల మధ్య అంతర్గత విభేదాల కారణంగానే ఈటల పార్టీ కార్యాలయానికి రావాట్లేదా? లేక పార్టీలోని నేతల సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారా..? మరోవైపు ఈటల అనుచరులు పార్టీ కార్యాలయానికి వెళితే.. మీ నాయకుడు మీకేం పదవులు ఇప్పించారంటూ అక్కడి నాయకులు కొందరు సూటిపోటిగా దెప్పి పొడుస్తున్నారట.

ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా, మూసీ పునరుద్ధరణపై ప్రజలకు అండగా ఉంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు ఈటల. హైడ్రా, మూసీ విషయంలో బస్తీ నిద్ర అనే కార్యక్రమం చేశారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హైడ్రా, మూసీపై బాధితులకు న్యాయం చేయాలంటూ పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. అంతేకాక నిత్యం ప్రజాసమస్యలు, భూ కబ్జాలు, డంపింగ్ యార్డ్ తదితర అంశాలపై తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంటారు ఈటల. అయితే ఇదంతా కేవలం వ్యక్తిగత ఇమేజ్‌ కోసమేనంటూ సొంత పార్టీకి చెందిన కొందరు.. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆవేదన చెందుతున్నారట.

బండితో పొరపొచ్చాలు పూర్తిగా సమసిపోకముందే.. ఈటలతో మిగతా బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పొడచూపుతున్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నాయకుల మధ్య పెరుగుతున్న దూరం.. కేడర్‌లో గందరగోళం సృష్టిస్తోందన్న వాదన లేకపోలేదు. ఈటల లాంటి కీలక నేత ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర, జాతీయ నాయకత్వం పట్టించుకోకపోతే.. పరిస్థితి మరింత క్లిష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విభేదాలకు చెక్ పెట్టి.. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో పార్టీ నాయకత్వం సక్సెస్ అవుతుందో ? లేదో? చూద్దాం.


Full View


Tags:    

Similar News