Off The Record: కాంగ్రెస్ కు బిగ్ షాక్? మీనాక్షి కొంపముంచిన కుంభం శివకుమార్?

Off The Record: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురైంది?

Update: 2026-06-13 01:10 GMT

Off The Record: కాంగ్రెస్ కు బిగ్ షాక్? మీనాక్షి కొంపముంచిన కుంభం శివకుమార్?

Off The Record: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టు ఉంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పరిస్థితి. కాంగ్రెస్‌లో బడా బడా లీడర్ల నుంచి పోటీని తట్టుకొని మరీ రాజ్యసభకు వెళ్లేందుకు హైకమాండ్‌ నుంచి ఆమోదం లభించింది. రాక రాక వచ్చిన సువర్ణ అవకాశం పెద్దల సభలో అడుగు పెట్టాలన్న కల తీరే సమయం. కానీ చివరి నిమిషంలో అంతా రివర్స్. ఊహించని విధంగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దానికి కారణం ఓ కేసు.

ఆమెపై వచ్చిన ఆ కేసు వివరాలను ఎన్నికల నామినేషన్‌లో పొందుపర్చలేదని ప్రత్యర్థులు అభ్యంతరం తెలపడం, దాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం,, గెలిచే సీటు చేజేతులా కాంగ్రెస్‌ రాజ్యసభ సీటును కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. ఐతే మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడానికి కారణం.. తెలంగాణలోని పాలమూరు జిల్లాలో నమోదైన కేసే ఇంత పని చేసింది.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఆ సీటును.. ఓ కేసు కారణంగా కోల్పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొదట్లో ఎన్నికల నిబంధనలకు సంబంధించిన సాంకేతిక అంశంగా కనిపించినా... తర్వాత బయటకు వచ్చిన వివరాలు తెలంగాణ రాజకీయాలను కూడా ఈ వివాదంలోకి తీసుకువచ్చాయి.

ఈ వ్యవహారంలో కీలకంగా మారింది నారాయణపేట జిల్లాతో ముడిపడిన ఒక పాత వివాదం. అప్పట్లో పెద్దగా చర్చకు రాని ఆ వ్యవహారం... ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారడం గమనార్హం.

నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు సంబంధించి పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే బాధితురాలు కేవలం కేసుల నమోదుతో ఆగిపోలేదు. పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన ఫిర్యాదులను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా తగిన న్యాయం జరగలేదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచే ఈ కథ కొత్త మలుపు తిరిగింది.

బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌లో కుంభం శివకుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకుల పేర్లను కూడా ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డి తదితరుల పేర్లు పిటిషన్‌లో ప్రస్తావించబడ్డాయి. తనకు న్యాయం చేయడంలో వీరు విఫలమయ్యారని ఆరోపిస్తూ నష్టపరిహారం కూడా కోరింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేసింది. అయితే అప్పట్లో ఈ వ్యవహారం పెద్దగా రాజకీయ ప్రాధాన్యం పొందలేదు.

కానీ రాజ్యసభ ఎన్నికల సమయంలో అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ పరిశీలన సందర్భంగా నాటి కోర్టు సమన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్‌లో ఈ వివరాలను ఎందుకు పేర్కొనలేదనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇది వెల్లడించాల్సిన అంశమేనని ప్రత్యర్థులు వాదనలు వినిపిస్తుండగా... మరోవైపు ఇది ఎలాంటి క్రిమినల్ కేసు కాదని, కేవలం ఒక పిటిషన్‌లో భాగంగా వచ్చిన సమన్లు మాత్రమేనని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో న్యాయపరమైన అంశం క్రమంగా రాజకీయ వివాదంగా మారిపోయింది. ఈ వ్యవహారం..కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం విషయంలో ఒక్క రాజ్యసభ సీటు కూడా ఎంతో కీలకం. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారు కావొచ్చు. ఇలాంటి తరుణంలో.. ఈ పరిణామం ఇటు కాంగ్రె‌స్‌ పార్టీకి, అటు మీనాక్షి నటరాజన్‌కు పెద్ద షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఐతే కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేకపోయి ఉంటే... ఆ పిటిషన్ వచ్చేదా..? ఆ పిటిషన్ లేకపోతే మీనాక్షి నటరాజన్ పేరు కోర్టు రికార్డుల్లోకి వచ్చేదా..? ఆ సమన్ల అంశం ఎన్నికల పరిశీలన వరకు వెళ్లేదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారమే మారిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే... నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన ఒక వివాదం.. హైదరాబాద్ కోర్టుకు చేరి... అక్కడి నుంచి ఎన్నికల అఫిడవిట్ అంశంగా మారి... చివరకు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. సాధారణంగా స్థానిక రాజకీయ వివాదాలు జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోనే పరిమితమవుతాయి. కానీ ఈ వ్యవహారం మాత్రం రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ రాజకీయాల వరకు వెళ్లడం విశేషంగా మారింది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నారాయణపేట పేరు, కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఈ మూడు అంశాలు ఒకే చర్చలో వినిపిస్తున్నాయి.

న్యాయపరంగా ఈ వివాదం ఇంకా ఎటూ తేలలేదు. నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి.. సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. మొత్తానికి ఒక కేసు.. మీనాక్షి పుట్టిముంచింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురైన ఈ భారీ ఎదురుదెబ్బ వెనుక... నారాయణపేట జిల్లాలో మొదలైన కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారమే అసలు మూలకారణంగా మారిందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో.



Full View


Tags:    

Similar News