Off The Record: కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమిత్ షా?

Off The Record: తెలంగాణలో బీజేపీ పొత్తులపై వస్తున్న ప్రచారాలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-06-13 01:16 GMT

Off The Record: కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమిత్ షా?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల గుసగుసలు జోరుగా వినిపిస్తున్న వేళ...ఢిల్లీ వేదికగా అమిత్ షా చేసిన ప్రకటన పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో ఎలాంటి పొత్తులు ఉండవు... బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. కేవలం తెలంగాణ మాత్రమే కాదు... పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో కూడా ఇదే వ్యూహం అమలు చేస్తామని చెప్పారు. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టామని... గతంలో అసాధ్యమనుకున్న అనేక రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు అమిత్‌షా. అసలు హోప్సే లేని చోట.. ఒంటరిగా వెళ్లి బెంగా‌ల్‌ను హస్తగతం చేసుకుంది కమలంపార్టీ. దీంతో తెలంగాణలోనూ.. బెంగాల్ తరహా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవడం ఒక్కటే లక్ష్యం కాదు...సొంత ఓటు బ్యాంక్ నిర్మించుకోవడమే అసలు టార్గెట్ అనే సంకేతాలు ఇస్తోంది. మరి బీజేపీ- బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలంటూ వస్తున్న ఆరోపణలకు ఇదే సమాధానమా..? లేక ఎన్నికల ముందు మరో రాజకీయ ట్విస్ట్ దాగి ఉందా..? అనేది చూడాలి. ఐతే ఈ ప్రకటనతో ఎక్కువ షాక్ ఎవరికి తగిలింది అనే మీమాంస లేకపోలేదు. బీజేపీపై మిలాఖత్ ఆరోపణలు చేస్తున్న అధికార కాంగ్రెస్‌కా...? లేక ప్రతిపక్ష బీఆర్ఎస్‌కా..? లేదంటే జనసేనకా..? ఫైనల్ గా తెలంగాణలో తిరిగి అడుగులు వేయాలని చూస్తున్న టీడీపీకా.. అన్న చర్చ సాగుతోంది.

గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అవినీతి కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది. కానీ ఇప్పుడు అమిత్ షా ప్రకటనతో ఆ ప్రచారానికి బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చినట్టైంది. అదే విధంగా ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవంతమైంది. అదే ఫార్ములా తెలంగాణలో కూడా అమలు అవుతుందని భావించారు. కానీ అమిత్ షా ఒక్క మాటతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి బీజేపీ సోలో పోరుతో లాభం ఎవరికీ..? నష్టం ఎవరికీ..? తెలంగాణలో నిద్రలేస్తున్న టీడీపీకి దీంతో బూస్టింగ్ వచ్చినట్టేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట‌.. ఇటీవల హైదరాబాద్ టూర్ లో మోదీ.. పవన్ కళ్యాణ్ ను పరామర్శించడం, చంద్రబాబు ఇంట్లో భేటీ కావడం... తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి విస్తరణపై ఊహాగానాలకు కారణమయ్యాయి. కానీ ఇప్పుడు అమిత్ షా ప్రకటనతో తెలంగాణలో జనసేనకు కమలం అండ దాదాపు ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం "తెలంగాణకు రాకుండా ఎవరు ఆపలేరు... జనసేన పోటీ చేస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.

బీజేపీ ఒంటరి పోరు ప్రకటనతో అత్యంత సంతోషంగా కనిపిస్తున్న పార్టీ తెలుగుదేశం. ఈ నిర్ణయం టీడీపీకి కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి గ్రామస్థాయి కార్యకర్తలు ఉన్నారనేది చాలా మంది అభిప్రాయం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ టీడీపీ కార్యకర్తల మద్దతు కోసం ప్రయత్నించాయి. చివరికి టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు మళ్లారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకుంటే... టీడీపీ తన సొంత స్థలాన్ని వెతుక్కునే పనితో పాటు, తన బలాన్ని తిరిగి నిరూపించుకునే అవకాశం లభించినట్టే. తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ప్రభావం పూర్తిగా ముగిసిపోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కమలం పార్టీ తీసుకున్న నిర్ణయం సైకిల్ పార్టీకి కొత్త ఆక్సిజన్‌లా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.మరోవైపు బీజేపీకి ఇది పెద్ద రిస్క్ గేమ్ కూడా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ గెలవలేదు. 2014లో టీడీపీతో పొత్తులో 5 సీట్లు... 2018లో ఒక్క సీటు... 2023లో 8 సీట్లు... అంటే గ్రాఫ్ పెరుగుతోంది గానీ...గమ్యం ఇంకా దూరంగానే ఉంది. అయినా..."పడితే లేవాలి...లేస్తే పరిగెత్తాలి...పరిగెత్తితే గెలవాలి" అన్న ఫార్ములాతో ముందుకెళ్తోంది. దీంతో ఏ ధైర్యంతో తెలంగాణలో ఒంటరి పోరుకు సై అంటోంది, ఇంతకీ అమిత్ షా మనసులో ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు పేరు కూడా వినపడని చోటా బీజేపీ ఎదిగిన తీరే శిరోధార్యంగా ఇప్పుడు తెలంగాణలోనూ చూపించాలని భావిస్తోంది.

బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు తాత్కాలిక విజయాల కంటే...దీర్ఘకాలిక రాజకీయ పెట్టుబడులపై దృష్టి పెట్టిందట‌‌. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెడితే సీట్లు రావచ్చు... కానీ సొంత ఓటు బ్యాంక్ పెరగదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో అమిత్ షాను చాలామంది "చాణక్యుడు అంటుంటారు‌. ఎందుకంటే... ఆయన ఎన్నికల రోజు కోసం వ్యూహాలు వేయరు... ఎన్నికలకు ఐదేళ్ల ముందే గేమ్ ప్లాన్ రెడీ చేస్తారు. అందుకే తెలంగాణలో ఇప్పటి నుంచే ఒంటరి పోరుకు పునాదులు వేస్తున్నారనే చర్చ నడుస్తోంది. పొత్తులతో కొంతకాలం అధికారానికి దగ్గరవచ్చు... కానీ శాశ్వతంగా ఎదగాలంటే సొంత ఓటు బ్యాంకు కావాలనే ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతోంది. "ఈ రోజు సీట్లు కాదు... రేపటి అధికారం కావాలి" అనే వ్యూహంతో పార్టీ అడుగులు వేస్తోందట‌. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ పోరులో జనసేన, టీడీపీ పాత్ర ఎంత ఉంటుంది..? కొత్త సమీకరణాలు పుడతాయా..? లేక ఒంటరి పోరే చివరి మాట అవుతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

రాజకీయాల్లో కనిపించేది ఒకటి.. జరిగేది మరొకటి అంటారు..! అమిత్ షా చెప్పిన 'ఒంటరి పోరు' నిజంగానే ఫైనల్ స్క్రిప్టా..? లేక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరో రాజకీయ క్లైమాక్స్ ప్రేక్షకుల ముందుకు రానుందా..? బీజేపీ-బీఆర్ఎస్‌ లోపాయికారీ పొత్తుపై వస్తున్న ఆరోపణలకు ఈ ప్రకటనతో తెరపడుతుందా అన్నదా చూడాలి‌. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ.... చాణక్యుడి ఎత్తులతో బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో అన్నది చూడాలి మరి.



Full View


Tags:    

Similar News