BRS: గులాబీ గూటికి మాజీ మంత్రి.. 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ సభ!
BRS: తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు.
BRS: గులాబీ గూటికి మాజీ మంత్రి.. 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ సభ!
BRS: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేగంగా మారిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి భారత్ రాష్ట్ర సమితి (BRS)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన ఆయన, అధికారికంగా పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
20న జగిత్యాలలో 'గులాబీ' జాతర:
జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణంలోని మోతె రోడ్డులో సభా స్థలిని జీవన్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ కీలక నేతలతో కలిసి పరిశీలించారు. ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, మోతే రోడ్డు వంటి ప్రాంతాలను ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఆయన సందర్శించారు.
లక్ష మందితో సభ - బీఆర్ఎస్ ధీమా:
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, సుమారు లక్ష మందితో ఈ భారీ సభను సక్సెస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ సభ ద్వారా స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.
మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి: జీవన్ రెడ్డి
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా శేష జీవితంలో కేసీఆర్ వంటి దార్శనిక నేతతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. కేవలం రెండున్నర ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది" అని ఆయన విమర్శించారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందిన జీవన్ రెడ్డి వైదొలగడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.