Khammam: సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డురావు మంత్రి కీలక వ్యాఖ్యలు

Khammam: ఏదులాపురం మునిసిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు.

Update: 2026-04-11 09:52 GMT

Khammam: సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డురావు మంత్రి కీలక వ్యాఖ్యలు

Khammam: ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయాలకు తావు లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఏదులాపురం మునిసిపల్ ప్రాంతంలో పర్యటించి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా వరంగల్ క్రాస్ రోడ్డు ఆటోనగర్‌లో ఖమ్మం–వరంగల్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వయా (ఆటో నగర్) వరకు 4 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఏదులాపురం మునిసిపల్ ప్రాంతంలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 227 మంది లబ్ధిదారులకు 70 లక్షల 42 వేల విలువైన సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏదులాపురం మునిసిపాలిటీ 30 డివిజన్ లలో సుమారు 4 కోట్ల 50 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదులాపురం మునిసిపాలిటీలో మొత్తం 58 కోట్ల 95 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పేదల సొంతింటి కలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజక వర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేసిందని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడతను కొద్ది రోజుల్లోనే ఇస్తామని తెలిపారు. 2 లక్షల రూపాయలు వరకు రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ప్రతి సంవత్సరం 23 నుండి 24 వేల కోట్ల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 73 వేల ఉద్యోగాలు ఇచ్చామని, విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏదులాపురం మునిసిపాలిటీ పాలక వర్గం ఏర్పడి కేవలం రెండు నెలలు మాత్రమే అయినప్పటికీ, దానిని అన్ని వసతులతో కూడిన అభివృద్ధి చెందిన మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, పాలేరు నియోజక వర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News