Hyderabad : నివసించడానికి బెస్ట్ సిటీ మన హైదరాబాదే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదికలో టాప్ ర్యాంక్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ నగరంగా నిలిచింది.

Update: 2026-03-30 05:35 GMT

Hyderabad : నివసించడానికి బెస్ట్ సిటీ మన హైదరాబాదే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదికలో టాప్ ర్యాంక్

WEF : హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. భాగ్యనగరవాసులు గర్వపడేలా, దేశం మొత్తం మన వైపు చూసేలా 'ఈజ్ ఆఫ్ లివింగ్' లో హైదరాబాద్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో మన నగరం అగ్రస్థానంలో నిలవడం విశేషం. అందమైన చారిత్రక కట్టడాలు, నోరూరించే బిర్యానీ, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు.. ఇవన్నీ ఒకెత్తయితే, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరికీ హాయిగా నివసించే అవకాశాన్ని కల్పించడంలో హైదరాబాద్‌కు సాటిలేదని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా ప్రకటించిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో, దేశంలోని అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది.

ఎందుకీ అగ్రస్థానం?

హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, మెరుగైన రహదారులతో మౌలిక సదుపాయాల్లో నగరం దూసుకుపోతోంది. ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, అద్దెలు ,రవాణా ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఐటీ రంగం ఉన్నప్పటికీ, ఇక్కడి వాతావరణం, వినోద సౌకర్యాలు , ప్రజల జీవనశైలి మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి.

హైదరాబాద్ ఎక్కడ ముందంజలో ఉంది?

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం వివిధ విభాగాల్లో నగరాల పనితీరు ఇలా ఉంది. పట్టికను గమనిస్తే, హైదరాబాద్ వాతావరణం (ర్యాంక్ 2) ,వైవిధ్యం (ర్యాంక్ 3) విభాగాల్లో అద్భుతమైన స్కోరు సాధించింది. బెంగళూరు మౌలిక సదుపాయాల్లో (ర్యాంక్ 1) ఉన్నప్పటికీ, రవాణా కష్టాల (ర్యాంక్ 8) వల్ల వెనకబడింది. ఢిల్లీ రవాణాలో (ర్యాంక్ 1) టాప్‌లో ఉన్నా, ఓవరాల్‌గా ఐదో స్థానానికే పరిమితమైంది. కానీ హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ ఓవరాల్ నంబర్ 1 గా నిలిచింది.

సామాన్యుడికి దక్కిన గౌరవం

ఈ నివేదిక కేవలం గణాంకాలు మాత్రమే కాదు, ప్రతి హైదరాబాద్ నివాసి గర్వపడాల్సిన విషయం. మల్టీ నేషనల్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగి నుంచి, కూలీ పనులు చేసుకునే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ ఈ నగరం భరోసానిస్తోంది. సురక్షితమైన వాతావరణం, గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం) వంటి అంశాలు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. నివసించడానికి అనువైన నగరం అంటే కేవలం పెద్ద భవనాలు ఉండటం కాదు.. అక్కడి మనుషుల మనసులు, తక్కువ ఖర్చుతో కూడిన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం. ఈ మూడింటి కలయికే నేటి హైదరాబాద్. అందుకే 2026లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచి చరిత్ర సృష్టించింది.

Tags:    

Similar News