TG20 League Auction: వరంగల్‌కు మహ్మద్ సిరాజ్.. మెదక్‌కు తిలక్ వర్మ.. పాలమూరుకు రోహిత్!
TG20 League 2026 auction Highlights. హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ20)కు రంగం సిద్ధమైంది.
TG20 League Auction: వరంగల్‌కు మహ్మద్ సిరాజ్.. మెదక్‌కు తిలక్ వర్మ.. పాలమూరుకు రోహిత్!
TG20 League Auction: తెలంగాణ క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలికేలా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ20)కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని యువ, ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే వేదికను కల్పించాలనే లక్ష్యంతో ఈ లీగ్‌ను హెచ్‌సీఏ ప్రారంభిస్తోంది. టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వేలంలో టీమిండియా ప్లేయర్స్, మన తెలుగోళ్లు భారీ ధర పలికారు.
వరంగల్‌కు మహ్మద్ సిరాజ్:
టీజీ20 లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్నాయి. ప్రతి జట్టుకు ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్ఠంగా రూ.60 లక్షల పర్స్ పరిమితిని హెచ్‌సీఏ నిర్ణయించగా.. కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. దీంతో ఫ్రాంఛైజీలు యువ ప్రతిభతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మంచి ధర పలికింది. వరంగల్ వారియర్స్ ఫ్రాంఛైజీ అతడిని రూ.14 లక్షలకు సొంతం చేసుకుంది. సిరాజ్ చేరికతో వరంగల్ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
హాట్ ఫేవరెట్‌గా తిలక్:
మరోవైపు భారత యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ వేలంలో హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అనంతరం నల్గొండ జట్టు కూడా బిడ్డింగ్‌లోకి రావడంతో ధర మరింత పెరిగింది. చివరకు మెదక్ రూ.33 లక్షల భారీ మొత్తానికి వర్మను తమ జట్టులోకి తీసుకుంది. అలాగే రోహిత్ రాయుడుకు కూడా వేలంలో మంచి ధర పలికాడు. అతడిని పాలమూరు స్ట్రైకర్స్ ఫ్రాంఛైజీ రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది. తెలంగాణ క్రికెట్‌లో గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించడంతో వేలం ప్రక్రియ మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
జూన్ 20 నుంచి లీగ్ ఆరంభం:
జూన్ 20 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీజీ20 2026 లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు సాగే ఈ టోర్నీ.. జూలై 11న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. రాష్ట్ర క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసే ఈ లీగ్ ద్వారా యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానుల కోసం టీజీ20 లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జియో హాట్‌స్టార్ యాప్ ద్వారా కూడా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ క్రికెట్ అభిమానులు ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.