Vaibhav Sooryavanshi : టీమిండియాలో 15 ఏళ్ల కుర్రాడు.. వైభవ్ సూర్యవంశీ కోసం రూల్స్ మార్చేసిన బీసీసీఐ!

Vaibhav Sooryavanshi : టీమిండియాకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ తన నిబంధనలను మార్చింది. సచిన్ టెండూల్కర్ తరహాలోనే వైభవ్ తల్లిదండ్రులు కూడా అతనితో పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

Update: 2026-06-07 01:15 GMT

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో ఒక సరికొత్త సంచలనం నమోదైంది. ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, మీడియా అటెన్షన్, సీనియర్ జట్టుతో కలిసి ఆడేటప్పుడు వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం ఏ చిన్నపిల్లాడికైనా మానసికంగా పెద్ద సవాలే. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.

ఇంగ్లాండ్, ఐర్లాండ్ లతో జరగబోయే రాబోయే సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీతో పాటు అతని తల్లిదండ్రులు కూడా భారత జట్టుతో కలిసి ప్రయాణించడానికి బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. విదేశీ పర్యటనల్లో కొత్త వాతావరణానికి అలవాటు పడేటప్పుడు వైభవ్ ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండేందుకు, అతనికి ఇంటి వాతావరణాన్ని కల్పించేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వైభవ్ ఇంకా చాలా చిన్నపిల్లాడు కాబట్టి, అతని పేరెంట్స్ కూడా ఐర్లాండ్, ఇంగ్లాండ్ వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చామని, వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నీ బోర్డే భరిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా స్పష్టం చేశారు.

ఈ సంఘటన గతంలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అరంగేట్రాన్ని గుర్తుచేస్తోంది. 1989లో సచిన్ టెండూల్కర్ కేవలం 16 సంవత్సరాల వయసులో తన మొదటి అంతర్జాతీయ సిరీస్ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు, అతనితో పాటు అతని పెద్దన్నయ్య అజిత్ టెండూల్కర్ కూడా వెళ్లారు. అప్పట్లో సచిన్‌కు అండగా ఉండేందుకు బోర్డు ఆ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ అలాంటి ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోవడం విశేషం.

నిజానికి భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలు లేదా లాంగ్ టోర్నమెంట్లు ఆడేటప్పుడు ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ఉనికిపై బీసీసీఐ చాలా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. సిరీస్ లేదా టోర్నమెంట్ 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటేనే, క్రీడాకారులు తమ భార్యను లేదా కుటుంబ సభ్యులను గరిష్టంగా 14 రోజుల పాటు మాత్రమే తమతో ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అంతకంటే తక్కువ రోజులు ఉండే పర్యటనలకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదు. కానీ వైభవ్ సూర్యవంశీ వయసును పరిగణనలోకి తీసుకుని, అతని కోసం బీసీసీఐ ఈ కఠినమైన నిబంధనలను పక్కన పెట్టి మినహాయింపు ఇచ్చింది.

వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. రాబోయే పర్యటనలో అతనికి గనుక తుది జట్టులో ఆడే అవకాశం వస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. గతంలో సచిన్ టెండూల్కర్ జట్టుకు ఎంపికైనప్పుడు అతని వయసు 16 సంవత్సరాల 194 రోజులు. సచిన్ తన మొదటి పర్యటనలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అదే విధమైన అద్భుతమైన అవకాశం ఈ బీహార్ కుర్రాడు వైభవ్‌కు కూడా దక్కింది.

Tags:    

Similar News