KL Rahul : కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం.. రూ. 2 లక్షల బేస్ ప్రైస్ ఉన్నా కొనని ఫ్రాంచైజీలు
KL Rahul : మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
KL Rahul : కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం.. రూ. 2 లక్షల బేస్ ప్రైస్ ఉన్నా కొనని ఫ్రాంచైజీలు
Maharaja Trophy : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నిన్నటివరకు ఐపీఎల్‌లో కోట్ల రూపాయల వేలంతో ఓ వెలుగు వెలిగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు స్థానిక లీగ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. రాహుల్ లాంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాడి కనీస ధర కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉన్నప్పటికీ, జట్లు అతడిపై బిడ్ వేయడానికి ఆసక్తి చూపకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఫామ్ తక్కువై కాదు.. టైమ్ లేకనే
ఈ వార్త వినగానే రాహుల్ ఫామ్ బాగోలేదేమో అని అనుకుంటే పొరపాటే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రాహుల్.. 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 593 పరుగులు చేసి దుమ్మురేపాడు. మరి అంతటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ఎందుకు వదిలేశారంటే.. దానికి ప్రధాన కారణం అందుబాటులో లేకపోవడం. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు వైస్-కెప్టెన్‌గా రాహుల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జూన్ 20 నుంచి జులై 12 వరకు మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరు వేదికలుగా మహారాజా ట్రోఫీ జరగనుంది. అయితే జాతీయ జట్టు షెడ్యూల్ కారణంగా రాహుల్ ఈ టోర్నీకి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడు. వేలం ఆరంభంలోనే అతను కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడని నిర్వాహకులు స్పష్టం చేయడంతో, కేవలం కొన్ని మ్యాచ్‌ల కోసం బడ్జెట్ వృథా చేయడం ఎందుకని ఫ్రాంచైజీలు వెనకడుగు వేశాయి.
కోట్లు పలికిన మిగతా స్టార్లు
ఒకవైపు కేఎల్ రాహుల్ అమ్ముడుపోకుండా మిగిలిపోతే.. మరోవైపు కర్ణాటకకు చెందిన ఇతర లోకల్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు భారీగా డబ్బులు కురిపించాయి. టోర్నీ అంతటా అందుబాటులో ఉండే ఆటగాళ్లను దక్కించుకోవడానికి జట్లు పోటాపోటీగా బిడ్లు వేశాయి. కరుణ్ నాయర్‌ను కోస్టల్ కింగ్స్ మంగళూరు జట్టు అత్యధికంగా రూ. 18 లక్షలకు దక్కించుకుంది. శివమొగ్గ యోధాస్ జట్టు రవి కిరణ్ సమ్రాన్‌ను రూ. 15.75 లక్షలకు కొనుగోలు చేయగా, హుబ్లీ టైగర్స్ జట్టు అభినవ్ మనోహర్‌ను రూ. 13.50 లక్షలకు, మయాంక్ అగర్వాల్‌ను రూ. 11.50 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
పైకి చూడ్డానికి కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్ అవ్వడం పెద్ద షాకింగ్ విషయంగా అనిపించినప్పటికీ.. దీని వెనుక ఉన్న లాజిక్ చూస్తే ఫ్రాంచైజీల నిర్ణయం సరైనదేనని అర్థమవుతుంది. కేవలం షెడ్యూల్ సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల రాహుల్ బ్రాండ్ వాల్యూకి ఎలాంటి ఢోకా లేదని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు.