Shreyas Iyer: శ్రేయస్‌కు టీమిండియా కెప్టెన్సీ రావడానికి కారణం నేనే.. ఆస్ట్రేలియా దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
Ricky Ponting on Shreyas Iyer India T20 Captaincy. కెప్టెన్‌గా శ్రేయస్ నియామకం కావడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shreyas Iyer: శ్రేయస్‌కు టీమిండియా కెప్టెన్సీ రావడానికి కారణం నేనే.. ఆస్ట్రేలియా దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
Shreyas Iyer: భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం కావడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ప్రముఖ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్‌కు భారత జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంలో తాను కూడా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించాడు. బీసీసీఐ సెలెక్టర్లతో మాట్లాడిన ప్రతి సందర్భంలో శ్రేయస్‌ను కెప్టెన్‌గా పరిశీలించాలని సూచించానని, అవకాశం ఇస్తే అస్సలు నిరాశపరచడని చెప్పానని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. శ్రేయస్‌తో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీల్లో కలిసి పనిచేసిన పాంటింగ్.. అతని నాయకత్వ లక్షణాలను దగ్గరగా గమనించాడు. అందుకే టీమిండియా కెప్టెన్సీకి సర్పంచ్ సాబ్ సరైన వ్యక్తి అని చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
'శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తే బీసీసీఐ సెలెక్టర్లు ఎప్పటికీ నిరాశ చెందరని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అతడు ఈ స్థాయికి చేరుకోవడం అతడి కష్టానికి దక్కిన గొప్ప గుర్తింపు. భారత జట్టుకు అద్భుతమైన కెప్టెన్‌గా రాణిస్తాడని నమ్మకం ఉంది' అని పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 2020 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 2024లో టైటిల్ అందించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తూ.. మరోసారి తన కెప్టెన్సీ నైపుణ్యాలను నిరూపించాడు. 2025లో పంజాబ్ జట్టును ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్ 2026లో సారథ్యంలో నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో అతడు మరింత మెచ్యూర్ అయిన నాయకుడిగా ఎదిగాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
'శ్రేయస్ అయ్యర్ గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడు. నాయకత్వంలోనూ, వ్యక్తిత్వంలోనూ మరింత పరిపక్వత సాధించాడు. భారత జట్టులో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. బీసీసీఐ సెలెక్టర్లు శ్రేయస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇది అతని ప్రతిభకు, నాయకత్వానికి లభించిన గొప్ప గుర్తింపు' అని పాంటింగ్ వివరించాడు. టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రేయస్‌తో మాట్లాడి అభినందించిన్నట్లు కూడా పాంటింగ్ వెల్లడించాడు. అయితే అదే సమయంలో భారత జట్టు నాయకత్వ బాధ్యత ఎంత పెద్దదో అతడికి గుర్తు చేస్తానని చెప్పాడు. 'భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఒత్తిడితో కూడిన బాధ్యతల్లో ఒకటి. ఆ బాధ్యత ప్రాముఖ్యతను శ్రేయస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని నమ్ముతున్నాను' అని పాంటింగ్ అన్నాడు.
శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో బీసీసీఐ సెలెక్టర్లు అతడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారని రికీ పాంటింగ్ వెల్లడించాడు. కీలక సందర్భాల్లో జట్టును ముందుండి నడిపించడం, ఒత్తిడిలోనూ నిలకడగా రాణించడం శ్రేయస్ ప్రత్యేకత అని కొనియాడాడు. 'ఎన్ని ఒత్తిడి పరిస్థితులు వచ్చినా శ్రేయస్ తన ఆటతో సమాధానం చెప్పాడు. పెద్ద మ్యాచ్‌ల్లో అతడు చూపిన ధైర్యం, నాయకత్వం సెలెక్టర్లను ఆకట్టుకుంది. కెప్టెన్‌గా మాత్రమే కాదు.. ఆటగాడిగా కూడా అతడు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారతాడు' అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచ కప్ 2028ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో.. అయ్యర్‌పై బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని అతడు ఎలా నిలబెట్టుకుంటాడో ఆసక్తికరంగా మారింది.