IND vs AFG Test: ముగిసిన రెండోరోజు ఆట.. అఫ్గానిస్థాన్‌ విలవిల.. ఫాలోఆన్ పక్కా!

IND vs AFG Test Day 2 Highlights. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది.

Update: 2026-06-07 12:57 GMT

IND vs AFG Test: ముగిసిన రెండోరోజు ఆట.. అఫ్గానిస్థాన్‌ విలవిల.. ఫాలోఆన్ పక్కా!

IND vs AFG Test: ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రహమత్‌ షా 43 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అఫ్సర్ జజాయ్ అవుట్ అనంతరం అంపైర్లు రెండోరోజు ఆటను ముగించారు. రెండోరోజులో అఫ్గానిస్థాన్‌పై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో మెరిసిపోగా.. అనంతరం భారత బౌలర్లు అఫ్గాన్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో ఫాలోఆన్ దిశగా వెళుతోంది.

మెరిసిన పంత్, సుందర్:

తొలి రోజు 368/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. మరింత దూకుడుగా ఆడి 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 126 పరుగులు చేశాడు. తొలి రోజు సెంచరీ పూర్తి చేసిన గిల్.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మానవ్ సుతార్ (28), మహ్మద్ సిరాజ్ (22), ధ్రువ్ జురేల్ (19) కూడా విలువైన పరుగులు జోడించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతడు ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. రెహమాన్ షరీఫీ, హస్మతుల్లా షాహిది చెరో వికెట్ దక్కించుకున్నారు.

అఫ్గాన్‌ బ్యాటర్లకు చుక్కలు:

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్గానిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అఫ్గాన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 113 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహమత్ షా మాత్రమే పోరాట పటిమ చూపించాడు. అతడు 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హస్మతుల్లా షాహిది 20, సెదిఖుల్లా అటల్ 17, అబ్దుల్ మాలిక్ 16, రహ్మనుల్లా గుర్బాజ్ 12, అఫ్సర్ జజాయ్ 3 పరుగులు మాత్రమే చేశారు.

ప్రసిద్ధ్, సుతార్ చెరో రెండు వికెట్లు:

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. అఫ్గానిస్థాన్ ఇంకా 451 పరుగుల వెనకంజలో ఉంది. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే మిగిలి ఉండటంతో.. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. మూడో రోజు తొలి సెషన్‌లోనే అఫ్గానిస్థాన్‌ను ఆలౌట్ చేసి ఫాలోఆన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ ప్రదర్శన చూస్తుంటే ఈ టెస్ట్‌లో విజయం లాంఛనమే. మూడో రోజు లేదా నాలుగో రోజు మ్యాచ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News