Sunrisers Hyderabad: చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్..ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.

Update: 2026-05-23 02:05 GMT

Sunrisers Hyderabad: చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్..ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం

SRH vs RCB : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సాక్షిగా ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. బౌండరీల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించిన ఆరెంజ్ ఆర్మీ, టీ20 క్రికెట్ చరిత్రలోనే అపూర్వమైన, అసాధారణమైన రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.

త్రిమూర్తుల పరుగుల వేట

ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకే సీజన్‌లో 500కు పైగా పరుగులు సాధించడం అత్యంత అరుదైన విషయం. ఆ అసాధారణ మైలురాయిని సన్‌రైజర్స్ త్రయం ఈ మ్యాచ్‌తో అందుకుంది.అభిషేక్ శర్మ తన మెరుపు స్టార్ట్‌లతో,ఇషాన్ కిషన్ తనదైన శైలి విధ్వంసంతో, హెన్రిచ్ క్లాసెన్ మిడిలార్డర్ బాధ్యతాయుతమైన హిట్టింగ్‌తో... ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును దాటారు. గతంలో 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఈ ఘనత సాధించగా... ఇప్పుడు ఆ అరుదైన క్లబ్‌లోకి అడుగుపెట్టిన రెండో జట్టుగా, ఈ సీజన్‌లో మొదటి జట్టుగా హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది.

సన్‌రైజర్స్‌కు వెన్నతో పెట్టిన విద్య

ఒకప్పుడు టీ20ల్లో 200 పరుగులు చేయడమే గొప్ప విషయం. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ దాన్ని సర్వసాధారణం చేసేసింది. తాజాగా ఆర్‌సీబీపై ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాద్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఆరు సార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా సరే.. బంతిని సిక్సర్లుగా మలచడమే పనిగా పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ పవర్‌హౌస్‌కు ఈ రికార్డే నిదర్శనం.

4 స్థానంలో ఆల్‌టైమ్ కింగ్

ఈ పరుగుల జాతరలో సన్‌రైజర్స్ నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. సాధారణంగా నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్లపై ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత, వికెట్లు పడకుండా చూసుకోవాల్సిన ఒత్తిడి ఉంటాయి. కానీ క్లాసెన్ వాటన్నింటినీ పక్కనబెట్టి పరుగుల వరద పారించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో కేవలం నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధికంగా 606 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా హెన్రిచ్ క్లాసెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో నంబర్ 4 పొజిషన్‌లో ఇంతటి భారీ స్కోరు సాధించిన ఆటగాడు మరొకరు లేరు. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ లతో కూడిన ఈ బ్యాటింగ్ లైనప్ సమిష్టిగా కదిలితే ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు హైదరాబాద్ ఖాతాలో చేరడం ఖాయమని ఆరెంజ్ ఆర్మీ నిరూపించింది.

Tags:    

Similar News