Vaibhav Sooryavanshi: ఈ పిలగాడేనా అంతలా ఆడేది.. యువ సంచలనం వైభవ్‌ను బిత్తరపోయి చూసిన గవాస్కర్!

Sunil Gavaskar Saw Vaibhav Sooryavanshi. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌ 2026లో 13 ఇన్నింగ్స్‌లలో 579 పరుగులు సాధించాడు.

Update: 2026-05-21 13:42 GMT

Vaibhav Sooryavanshi: ఈ పిలగాడేనా అంతలా ఆడేది.. యువ సంచలనం వైభవ్‌ను బిత్తరపోయి చూసిన గవాస్కర్!

Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. మైదానం ఏదైనా, బౌలర్ ఎవరైనా.. బంతిని బౌండరీలు సునాయాసంగా తరలిస్తున్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో 579 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో సహా 236.32 అసాధారణ స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతడి వద్దే ఉంది. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

తాజాగా జైపూర్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి జట్టుకు ఘన విజయం అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. బుడ్డోడి ధాటికి లక్నో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కామెంట్రీ సమయంలో సునీల్ గవాస్కర్.. వైభవ్‌ను ఎంతో ఆసక్తిగా గమనించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువ ఆటగాడి షాట్ల ఎంపిక, ఆత్మవిశ్వాసం, పరిస్థితులకు తగ్గట్టు ఆడిన తీరు గవాస్కర్‌ను మెస్మరైజ్ చేసింది. వైభవ్‌ ఆటకు సన్నీ ఫుల్ ఫిదా అయినట్లు ఆ వీడియో చూస్తే.. స్పష్టంగా అర్ధమవుతోంది.

38 బంతుల్లోనే 93 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. అవార్డు అందుకోవడానికి వెళుతుండగా, తిరిగి వస్తుండగా వైభవ్‌ను అదేపనిగా సునీల్ గవాస్కర్ గమనించాడు. ఈ పిలగాడేనా అంతలా ఆడేది అన్నట్లు బిత్తరపోయి చూశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుస్తోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజెన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో సునీల్ గవాస్కర్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని చూస్తున్న తీరును గమనించండి. వైభవ్ అమాయకపు ప్రవర్తనకు ఆయన మంత్రముగ్ధులయ్యారు' అని ఒకతను రాసుకొచ్చాడు.

అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ మాట్లాడుతూ.. 'మా బౌలింగ్ సమయంలో బయట కూర్చుని పిచ్‌ను గమనించాను. వికెట్ చాలా బాగుందని అనిపించింది. ప్రారంభంలో తొందరపడకుండా కొంత సమయం తీసుకుని ఆడాలనుకున్నా. అలా చేస్తే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కూ సహాయం అవుతుందని భావించాను. నేను ఎప్పుడైనా రెండు మూడు బౌండరీలు కొట్టగలనని నాకు తెలుసు. అందుకే తొందరపడకుండా చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాలని అనుకున్నాను' అని చెప్పాడు. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఆ సీజన్‌లోనే తన ప్రతిభతో ఆకట్టుకున్న అతడు.. తర్వాత భారత అండర్-19 జట్టులో కూడా అద్భుత ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో మరింత పరిణతి చెందిన బ్యాటర్‌గా ఆడుతున్నాడు.


Tags:    

Similar News