IPL 2026 : కోహ్లీని అవుట్ చేసి చరిత్ర సృష్టించిన సాకిబ్ హుస్సేన్.. ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డ్

IPL 2026 : బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. వరుసగా 10 మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

Update: 2026-05-23 01:04 GMT

Sakib Hussain

IPL 2026 : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం, ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 255 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఆ తర్వాత బౌలింగ్‌లో సాకిబ్ హుస్సేన్ తన మార్క్ చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

తొలి ఓవర్లోనే అదిరిపోయే వికెట్

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్‌ను స్థానికంగా గోపాల్‌గంజ్ రబడా అని పిలుస్తుంటారు. బెంగళూరు ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సమయంలో తన కోటా మొదటి ఓవర్లోనే సాకిబ్ అద్భుతం చేశాడు. క్రీజులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న విరాట్ కోహ్లీని ఒక అద్భుతమైన స్లోయర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. సాకిబ్ వేసిన ఆ స్లో బాల్‌ను కవర్స్ మీదుగా బౌండరీకి తరలించే క్రమంలో విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న స్మరణ్ రవిచంద్రన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ పట్టుకోవడంతో కోహ్లీ కేవలం 15 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది.

ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

ఈ వికెట్‌తో సాకిబ్ హుస్సేన్ ఐపీఎల్ చరిత్ర పుటల్లో కెక్కాడు. లీగ్‌లోకి అరంగేట్రం చేసిన మొదటి సీజన్లోనే లీగ్ చరిత్రలో ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఒక అద్భుతమైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఆడిన మొదటి వరుస 10 మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టిన ఏకైక బౌలర్‌గా సాకిబ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ ముగిసే సమయానికి సాకిబ్ హుస్సేన్ ఖాతాలో మొత్తం 15 వికెట్లు చేరడం అతని స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది.

చెప్పులు కొనడానికి డబ్బుల్లేని పరిస్థితి నుండి.. కోహ్లీ వికెట్ తీసే స్థాయికి

సాకిబ్ హుస్సేన్ ఐపీఎల్ ప్రయాణం వెనుక ఎంతో కంటతడి పెట్టించే కథ ఉంది. బీహార్‌లోని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్‌కు కనీసం క్రికెట్ ఆడేందుకు అవసరమైన బూట్లు కొనుక్కోవడానికి కూడా పైసల్లేని పరిస్థితి ఉండేది. కొడుకు పడుతున్న కష్టాన్ని చూడలేక అతని తల్లి తన ఒంటిపై ఉన్న బంగారు నగలను అమ్మి మరీ సాకిబ్‌కు క్రికెట్ కిట్ కొనిపించింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇతని టాలెంట్‌ను గుర్తించి వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు సొంతం చేసుకుంది. 2024 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఆడే అవకాశం రాలేదు. కానీ అక్కడ స్టార్ బౌలర్ల వద్ద బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు.

ఈషాన్ కిషన్ అండతోనే హైదరాబాద్ టీమ్‌లోకి

బీహార్ దేశవాళీ క్రికెట్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఈషాన్ కిషన్ కెప్టెన్సీలో సాకిబ్ అద్భుత ప్రదర్శన చేశాడు. సాకిబ్ టాలెంట్‌ను దగ్గరుండి చూసిన ఈషాన్ కిషన్, అతనికి కెరీర్‌లో ఎంతో అండగా నిలిచాడు. ప్రస్తుత హైదరాబాద్ జట్టులో ఈషాన్ కిషన్ కీలక సభ్యుడిగా ఉన్నందున, సాకిబ్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దృష్టిలో పడటానికి పరోక్షంగా సహాయం చేశాడు. ఈ మ్యాచ్‌లోనే ఈషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో రాణించగా, అభిషేక్ శర్మ 56 రన్స్, హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులతో విరుచుకుపడటంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Tags:    

Similar News