MI vs SRH IPL 2026 : రికెల్టన్ సెంచరీ వృధా.. ముంబైకి సొంత గడ్డపై వరుసగా నాలుగో ఓటమి
MI vs SRH IPL 2026: వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు విజయం అందుకుంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్నిహెడ్, క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగులతో ఛేదించారు. ఇది ముంబైకి సొంత గడ్డపై వరుసగా నాలుగో ఓటమి.
Sunrisers Hyderabad
MI vs SRH IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం ఆగడం లేదు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి హైదరాబాద్ రికార్డు విజయాన్ని అందుకుంది. ఏకంగా 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, వాంఖడే చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్‌ను నమోదు చేసింది. ముంబై బ్యాటర్ రాన్ రికెల్టన్ మెరుపు సెంచరీ బాదినప్పటికీ, సన్‌రైజర్స్ హిట్టర్ల ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఈ సీజన్‌లో ముంబైకి ఇది ఆరో ఓటమి కాగా, సొంత మైదానంలో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే ఐపీఎల్ కెరీర్ లోనే తన తొలి సెంచరీని పూర్తి చేశాడు. ఇది ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. రికెల్టన్ మొత్తం 123 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా (31), విల్ జాక్స్ (46) కూడా వేగంగా ఆడటంతో ముంబై భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఆ సమయంలో ముంబై విజయం ఖాయమని అందరూ అనుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను ట్రెవిస్ హెడ్ ఉప్పెనలా చుట్టుముట్టాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అంతగా ప్రభావం చూపని హెడ్, సరైన సమయంలో ఫామ్ లోకి వచ్చాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ (45)తో కలిసి కేవలం 9 ఓవర్లలోనే స్కోరును 130 పరుగులకు చేర్చాడు. వీరిద్దరి బాదుడు చూసి వాంఖడే ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. మధ్యలో ముంబై బౌలర్లు 6 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి పుంజుకునే ప్రయత్నం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
హెడ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్ క్లాసెన్ అసలు సిసలు విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. క్లాసెన్ (65 నాటౌట్)కి తోడు సలీల్ అరోరా (30 నాటౌట్) అద్భుతంగా సహకరించాడు. వీరిద్దరూ కలిసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. హైదరాబాద్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ లో వరుసగా ఐదు విజయాలు సాధించి సెమీస్ రేసులో దూసుకుపోతోంది.
ముంబై ఇండియన్స్‌కు తన సొంత మైదానం వాంఖెడే ఇప్పుడు ఒక శాపంలా మారింది. ఈ సీజన్ లో ఇక్కడ ఆడిన గత మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై, ఇప్పుడు నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే చరిత్రలో 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరును కాపాడుకోలేకపోవడం ముంబైకి ఇదే మొదటిసారి. బౌలింగ్ విభాగంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తుండటం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.