Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడు?
Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో అప్పుడే తదుపరి సీజన్ సమీకరణాలు మొదలైపోయాయి.
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. కొత్త కెప్టెన్‌గా తెలుగోడు?
Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో అప్పుడే తదుపరి సీజన్ సమీకరణాలు మొదలైపోయాయి. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టిస్తే.. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ మాత్రం పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ జట్టులో సమూల మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 కోసం ఏకంగా 15 మంది ఆటగాళ్లను వదిలించుకుని, కేవలం 9 మందిని మాత్రమే ఉంచుకోవాలని ముంబై వ్యూహాలు రచిస్తోంది.
రోహిత్, హార్దిక్, సూర్యలకు గుడ్ బై.. ఆ 15 మంది అవుట్..!
ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకోబోయే అత్యంత కఠినమైన నిర్ణయాల్లో సీనియర్ ఆటగాళ్లను వదిలిపెట్టడం మొదటిది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజాలను వేలానికి వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మిచెల్ సాంట్నర్ స్థానంలో వచ్చిన కేశవ్ మహారాజ్ ఆధునిక టీ20 ఫార్మాట్‌కు సరిపోడనే ఉద్దేశంతో అతడిని కూడా విడుదల చేయనున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఆటగాడిగా విఫలమవ్వడమే కాకుండా, జట్టులోని సీనియర్లతో అతడికి సఖ్యత లేకపోవడం మైనస్‌గా మారింది. దీంతో హార్దిక్ వచ్చే సీజన్‌లో వేరే జట్టుకు మారడం లేదా నేరుగా వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు రాబిన్ మింజ్, మహిపాల్ లోమ్రోర్, మయాంక్ మార్కండే, దనిష్ మలేవర్, క్రిష్ భగత్, మయాంక్ రావత్, గాయపడిన అథర్వ అంకోలేకర్‌లను కూడా ముంబై వదులుకోనుంది.
ముంబై నమ్ముకున్న ఆ 9 మంది ధీరులు వీరే..!
భారీ ప్రక్షాళన తర్వాత ముంబై ఇండియన్స్ కేవలం 9 మంది ఆటగాళ్లను మాత్రమే తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఈ జాబితాలో భవిష్యత్తు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీరితో పాటు నమన్ ధీర్, రియాన్ రికెల్టన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, రాజ్ బావా, అశ్విని కుమార్‌లను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. యువ వికెట్ కీపర్ రుచిత్ అహీర్, అల్లా గజన్‌ఫర్ భవితవ్యంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
టీమిండియా తదుపరి వారసుడు.. ముంబైకి కెప్టెన్‌గా తిలక్ వర్మ?
రాబోయే సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నాయకత్వం వహించబోతున్నాడనే వార్త ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. జట్టులోని కోర్ గ్రూప్‌తో తిలక్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా, రోహిత్ శర్మ సైతం తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు సమాచారం.
తిలక్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం లేకపోయినప్పటికీ, దేశీవాళీ క్రికెట్‌లో చక్కగా రాణించాడు. అంతేకాకుండా, జూన్ 9 నుంచి శ్రీలంకలో జరగబోయే వన్డే త్రైపాక్షిక సిరీస్‌లో ఇండియా-ఏ జట్టుకు అతడే సారథ్యం వహించనున్నాడు. అక్కడ తిలక్ గనుక తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకుంటే, ఐపీఎల్ 2027 లో ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్‌గా ఈ తెలుగు తేజం అవతరించడం ఖాయం.
గత వైభవానికి ఎలాగైనా తిరిగి చేరుకోవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సంచలనంగా మారాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్నా ఆశించిన ఫలితాలు రానప్పుడు ఎంతటి స్టార్ ఆటగాడినైనా పక్కన పెట్టక తప్పదని నీతా అంబానీ మార్క్ వ్యూహాలు స్పష్టం చేస్తున్నాయి. యువ రక్తం, సరికొత్త ఉత్సాహంతో తిలక్ వర్మ సారథ్యంలో ముంబై మళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి.