BCCI : బీసీసీఐ కొత్త రూల్.. ఇకపై నచ్చినప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటామంటే కుదరదు

BCCI : విదేశీ టీ20 లీగ్‌లలో ఆడటం కోసం ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే భారత క్రికెటర్లను అడ్డుకునేందుకు బీసీసీఐ సరికొత్త రిటైర్మెంట్ పాలసీని తీసుకురాబోతోంది.

Update: 2026-06-05 01:32 GMT

BCCI 

BCCI : భారతీయ క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లపై చూపిస్తున్న విపరీతమైన ఆసక్తిని అడ్డుకోవడానికి బీసీసీఐ ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. విదేశాల్లో జరిగే లీగ్‌లలో ఆడి భారీగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఆటగాళ్లు అకస్మాత్తుగా రిటైర్మెంట్ దారి పడుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ, ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు సమయం కంటే ముందే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేస్తుండటంపై బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఉన్న బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత జట్టులో ఆడుతున్న వారు లేదా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఒప్పందాలలో ఉన్న యాక్టివ్ క్రికెటర్లు ఎవరూ కూడా విదేశీ లీగ్‌లలో ఆడటానికి వీల్లేదు. ఒకవేళ విదేశాల్లో ఆడాలి అనుకుంటే, వారు అన్ని రకాల భారతీయ క్రికెట్ ఫార్మాట్లకు అలాగే ఐపీఎల్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, కొందరు ఆటగాళ్లు ఈ నిబంధనలోని లూప్‌హోల్‌ను ఆసరాగా చేసుకుంటున్నారు. వారు భారత్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే విదేశీ జట్లతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు చెక్ పెట్టాలని బీసీసీఐ గట్టిగా నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే విదేశీ లీగ్‌ల వైపు వెళ్లే ప్లేయర్లకు బ్రేకులు వేయడానికి ఒక కఠినమైన కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను తీసుకురావాలని బోర్డు ఆలోచిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఎవరైనా భారతీయ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే విదేశీ లీగ్‌లలో ఆడితే, అతను తిరిగి భారత క్రికెట్ వ్యవస్థలోకి రాకుండా కనీసం 5 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తారు. అంటే కోచ్‌గానో, మెంటార్‌గానో లేదా బోర్డుకు సంబంధించిన ఎలాంటి పదవుల్లోనూ ఐదేళ్ల పాటు కొనసాగడానికి వీలుండదు. ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తొందరపాటుతో కాకుండా చాలా ఆలోచించి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయానికి బోర్డు మొగ్గు చూపుతోంది.

మన దేశంలోని ప్రతిభావంతులైన యువకులు, అలాగే ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ ప్లేయర్లు ఎక్కువ కాలం పాటు భారత దేశవాళీ క్రికెట్ నిర్మాణంలో, ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటంలో భాగస్వాములు కావాలని బీసీసీఐ కోరుకుంటోంది. విదేశీ డబ్బు ఆశ చూపి భారతీయ క్రికెట్ వ్యవస్థను దెబ్బతీయకుండా ఉండటమే ఈ కొత్త పాలసీ ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ కొత్త రిటైర్మెంట్ పాలసీకి సంబంధించిన లీగల్ అంశాలను పూర్తిగా పరిశీలించి, దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శికి అపెక్స్ కౌన్సిల్ అప్పగించింది.

Tags:    

Similar News