IND vs AFG: కోహ్లీ ఎవరయ్యా.. 3వ స్థానంలో ఓ తోపును దింపుతున్నాం.. మరో 15 ఏళ్ల తిరుగులేదంతే
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్ జరిగింది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో తలపడబోతున్నాయి.
IND vs AFG: కోహ్లీ ఎవరయ్యా.. 3వ స్థానంలో ఓ తోపును దింపుతున్నాం.. మరో 15 ఏళ్ల తిరుగులేదంతే
IND vs AFG: దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌తో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త సవాలుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జట్టును వేధిస్తున్న కీలకమైన ‘నంబర్ 3’ బ్యాటింగ్ స్థానంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టతనిచ్చాడు.
ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన సమరం.. కోచ్ మనసు గెలిచిన సాయి సుదర్శన్..
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్ జరిగింది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన దేవదత్ పడిక్కల్ జట్టులో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. కానీ, మ్యాచ్‌కు ఒకరోజు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ అన్ని అనుమానాలకు తెరదించారు. తమిళనాడు యువ సంచలనం సాయి సుదర్శన్‌కే తాము అండగా ఉంటామని స్పష్టం చేశాడు.
4-5 మ్యాచ్‌లతో ఆటగాడిని అంచనా వేయలేం: గంభీర్
సాయి సుదర్శన్‌కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గంభీర్ గట్టిగా సమర్థించాడు. "సాయి సుదర్శన్‌కు టెస్టుల్లో ఇంకా సరైన అవకాశాలు రాలేదు. అతడు ఇంగ్లండ్‌లో ఆడాడు. మేము అతడికి మరికొంత సమయం ఇస్తాం. కేవలం 4 లేదా 5 మ్యాచ్‌ల ప్రదర్శనను బట్టే ఒక ఆటగాడిని అంచనా వేస్తే.. భవిష్యత్తు కోసం ఒక బలమైన జట్టును ఎప్పటికీ నిర్మించలేం. సాయి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 700కు పైగా పరుగులు సాధించాడు." అని గంభీర్ పేర్కొన్నాడు.
కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సుదర్శన్‌పై ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో సుదర్శన్ చెలరేగి ఆడి ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీల సహాయంతో ఏకంగా 722 పరుగులు బాదాడు. అదే ఫామ్‌ను ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ చూపించాల్సిన అవసరం ఉంది.
సాయి సుదర్శన్ టెస్టు గణాంకాలు..
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్, ఇప్పటివరకు భారత జట్టు తరపున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
మొత్తం ఇన్నింగ్స్‌లు: 11 (అన్నీ నంబర్ 3 స్థానంలోనే)
చేసిన పరుగులు: 302
బ్యాటింగ్ సగటు: 27.45
అర్ధ శతకాలు: 2
ఈ గణాంకాలు అతడి అసలైన ప్రతిభకు అద్దం పట్టడం లేదనే చెప్పాలి. బహుశా అందుకే గౌతమ్ గంభీర్ అతడికి మరికొన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చి నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం యువ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం ఇచ్చే మద్దతును స్పష్టం చేస్తోంది. అపారమైన ప్రతిభ ఉన్న సాయి సుదర్శన్, కోచ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మూడో స్థానంలో సుదర్శన్ స్థిరపడితే టెస్టుల్లో భారత బ్యాటింగ్ సమస్యలకు పెద్ద ఉపశమనం లభించినట్లే.