IPL 2026 Captains: ముగ్గురు కెప్టెన్లకు గుడ్‌బై.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

IPL 2026 Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ మూడు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది.

Update: 2026-05-14 14:58 GMT

IPL 2026 Captains: ముగ్గురు కెప్టెన్లకు గుడ్‌బై.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

IPL 2026 Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ మూడు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషభ్ పంత్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే వచ్చే సీజన్‌కు కెప్టెన్సీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఈ ముగ్గురు వరుసగా రెండు సీజన్లలోనూ (2025, 2026) తమ జట్లను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో విఫలమవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

టీమిండియా కీపర్ రిషభ్ పంత్ ప్రదర్శనపై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటికే లక్నో అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. భారీ అంచనాల మధ్య రూ.27 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం.. అతడి నాయకత్వంపై తీవ్ర నిరాశతో ఉందని తెలుస్తోంది. ఈ సీజన్‌లో పంత్ 11 మ్యాచ్‌ల్లో కేవలం 251 పరుగులే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ కూడా 138 మాత్రమే.

ఆధునిక టీ20 క్రికెట్ ప్రమాణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌లో గతంలో కనిపించిన దూకుడు లేదని అభిప్రాయపడుతున్నారు. జట్టు కాంబినేషన్ ఎంపికలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అర్షిన్ కులకర్ణిని ఓపెనర్‌గా పంపించడం.. హిమ్మత్ సింగ్, ఆయుష్ బదోనీకి వరుస అవకాశాలు ఇవ్వడం వంటి నిర్ణయాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100 పరుగులే చేశాడు. అందులో 56 పరుగులు ఒకే ఇన్నింగ్స్‌లో వచ్చాయి. మిగిలిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కలిపి 44 పరుగులే చేయడం విమర్శలకు దారితీసింది. బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లు మాత్రమే వేసి 10 వికెట్లు తీశాడు. కెప్టెన్‌గా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా.. కోచ్ హేమంగ్ బదానీ, వెంకుగోపాల్ రావుపై ఆధారపడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్ నుంచి ఢిల్లీ క్రికెట్ ఆపరేషన్స్ బాధ్యతలు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తీసుకోనుండటంతో అక్షర్ కెప్టెన్సీ కొనసాగుతుందా అన్నది సందేహంగా మారింది.

అజింక్య రహానే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ జట్టును ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో రహానే 11 మ్యాచ్‌ల్లో 237 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 133గా ఉంది. టీ20 ఫార్మాట్‌కు తగ్గ దూకుడు లేకపోవడం జట్టుకు మైనస్‌గా మారింది. అంగ్‌క్రిష్ రఘువంశితో కలిసి టాప్ ఆర్డర్‌లో నెమ్మదిగా ఆడటం వల్ల కోల్‌కతా చాలా మ్యాచుల్లో మొమెంటమ్ కోల్పోయింది. రహానే, రఘువంశి కలిపి 11 మ్యాచ్‌ల్లో కేవలం 25 సిక్సర్లు మాత్రమే కొట్టడం జట్టు బ్యాటింగ్ బలహీనతను బయటపెట్టింది. అంతేకాదు వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడు.

అయితే అక్షర్ పటేల్, రిషభ్ పంత్‌లకు ఆటగాళ్లుగా వచ్చే సీజన్లలో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కానీ కెప్టెన్లుగా మాత్రం వారి భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు 37 ఏళ్ల అజింక్య రహానేపై వచ్చే మినీ వేలంలో ప్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసే సరికి ఈ మూడు జట్లలో పెద్ద మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News