Jasprit Bumrah: 19 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చా.. కెప్టెన్ అవుతానని అనుకోలేదు!
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా తొలిసారి ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Jasprit Bumrah: 19 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చా.. కెప్టెన్ అవుతానని అనుకోలేదు!
Jasprit Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాలలో మ్యాచ్ ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గత రెండు మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో బుమ్రాకు ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. బుమ్రా తొలిసారి ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ అనంతరం బుమ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
టాస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. గత మ్యాచ్‌ను గమనించాం. రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత మెరుగ్గా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నాం' అని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించడం ఎలా అనిపిస్తోందని అడగగా.. 'ఇది చాలా మంచి అనుభూతి. నేను 19 ఏళ్ల వయసులో ముంబై జట్టులోకి వచ్చాను. ముంబైకి కెప్టెన్ అవుతానని అస్సలు అనుకోలేదు. అంతకుముందు టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్ అవుతానని కూడా ఏనాడూ ఊహించలేదు. ఇది నాకు కొత్త ఛాలెంజ్. బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం. ముంబై జట్టును ముందుండి నడిపించేందుకు ప్రయత్నిస్తా' అని బుమ్రా తెలిపాడు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్నప్పటికీ.. మిగిలిన మ్యాచ్‌ల్లో పోరాటం కొనసాగిస్తామని బుమ్రా స్పష్టం చేశాడు. 'క్రికెట్‌లో మంచి రోజులు ఉంటాయి. అలానే చెడు రోజులు కూడా వస్తాయి. ప్రతి పరిస్థితి మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఈ సీజన్ నుంచి కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మంచి క్రికెట్ ఆడాలని, జట్టుగా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాం. మా ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నాం' అని బుమ్రా చెప్పాడు.
ముంబై జట్టులో రెండు మార్పులు చేసినట్లు బుమ్రా వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని తెలిపాడు. అలాగే ఆఫ్ఘాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ కూడా జట్టులో లేడని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీ, సూర్యకుమార్ లేకపోవడంతో ముంబై జట్టు ఇప్పుడు యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. మరోవైపు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. దీంతో ధర్మశాలలో ఈ పోరు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.