RCB vs KKR: బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి.. మరి రాయ్‌పూర్‌లో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ ఎందుకో తెలుసా?
RCB vs KKR: ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో కూడా నిర్వహించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
RCB vs KKR: బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి.. మరి రాయ్‌పూర్‌లో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ ఎందుకో తెలుసా?
RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ కీలక హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కాకుండా.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కూడా నిర్వహించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆర్సీబీ ఆడనున్న మ్యాచ్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఆర్సీబీ టీమ్ తమ హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడుతోంది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ తన తొలి ఐదు హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడింది. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే చివరి రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను అక్కడే ఆడగా.. ఇప్పుడు కేకేఆర్‌తో మ్యాచ్ కూడా అదే వేదికపై జరగనుంది. ఇందుకు ప్రధాన కారణం చిన్నస్వామి స్టేడియంపై నెలకొన్న అనిశ్చితి.
గతేడాది జూన్ 4న ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి పోటీ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. దీంతో 2026 ఐపీఎల్ మ్యాచ్‌లకు స్టేడియానికి అనుమతి లభిస్తుందా లేదా అన్న సందిగ్ధత చివరి వరకు కొనసాగింది.
ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ ప్రత్యామ్నాయ హోమ్ వేదిక కోసం అన్వేషించింది. అదే సమయంలో రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఫ్రాంచైజీ అంగీకరించింది. అనంతరం బెంగళూరులో మ్యాచ్‌లకు అనుమతి వచ్చినప్పటికీ.. ముందుగా చేసుకున్న ఒప్పదం ప్రకారం రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు నిర్వహించాలని ఆర్సీబీ నిర్ణయించింది.
ఈ ఒప్పందం కోసం ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్, బీసీసీఐ జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ భాటియా.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని జనవరిలో కలిసినట్లు సమాచారం. మార్చిలో ఆర్సీబీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లకు అనుమతి లభించిందని, మిగిలిన రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం, కేఎస్‌సీఏ, బెంగళూరు పోలీసులకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
మరోవైపు ఈసారి బెంగళూరుకు ఐపీఎల్ ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ మ్యాచ్‌ల అవకాశం దక్కలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుగా ఆర్సీబీకి ఫైనల్ వేదికగా చిన్నస్వామి స్టేడియం అవకాశాలు ఉన్నప్పటికీ.. టికెట్ కేటాయింపుల సమస్యల కారణంగా బీసీసీఐ ఆ అవకాశాన్ని రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సీజన్‌లో బెంగళూరులో ఇకపై ఎలాంటి ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండవు.
రాయ్‌పూర్‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త కాదు. 2013 నుంచి 2016 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) రెండో హోమ్ గ్రౌండ్‌గా ఈ వేదికను ఎంచుకుంది. దాంతో మొత్తం ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లు అక్కడ జరిగాయి. 2016లో ఆర్సీబీ అక్కడ ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీకి అదృష్టం కలిసి వస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రాయ్‌పుర్‌లో కొద్దిసేపటి క్రితం వర్షం కురిసింది. దాంతో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు.