SRH-IPL 2026: ఓటమి బాధలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్!

SRH-IPL 2026: ఐపీఎల్ 2026లో ఓటమి బాధలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్ తగిలింది.

Update: 2026-05-13 12:30 GMT

SRH-IPL 2026: ఓటమి బాధలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్!

SRH-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 82 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. 169 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. కాగిసో రబాడ, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్‌ ముందు సన్‌రైజర్స్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ చేసిన 19 పరుగులే టాప్ స్కోర్ అంటే.. ఆరెంజ్ ఆర్మీ ఎంత దారుణంగా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు.

ఓటమి బాధలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. కనీస ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కమిన్స్‌పై ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ప్రకటన విడుదల చేసింది. ఇది ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు మొదటి తప్పిదం కావడంతో రూ.12 లక్షల ఫైన్‌తో సరిపెట్టారు.

అయితే ఎస్‌ఆర్‌హెచ్‌, జీటీ మ్యాచ్ మొత్తం కేవలం 34.5 ఓవర్లలోనే ముగిసినప్పటికీ.. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సీజన్‌లో పలువురు కెప్టెన్లు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ నుంచి హెచ్చరికలు, జరిమానాలు ఎదుర్కొన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్, పంజాబ్ కింగ్స్ నాయకుడు శ్రేయస్ అయ్యర్ ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. రెండోసారి కూడా ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే.. కెప్టెన్ సహా ఆటగాళ్ల ఫీజులో కూడా కోత పడుతుంది. మూడోసారి కూడా రిపీట్ అయితే జరిమానాతో పాటు సారథి ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. గుజరాత్ బౌలర్ల ప్రదర్శనను ప్రశంసించాడు. ‘పిచ్ చాలా కఠినంగా ఉంది. బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే బ్యాటర్లకు పరుగులు చేయడం చాలా కష్టం అయింది. గుజరాత్ బౌలర్లు అదే ప్లాన్‌ను అద్భుతంగా అమలు చేశారు. మేము కూడా మా బౌలింగ్ సమయంలో అదే లెంగ్త్ కొనసాగించి ఉండాల్సింది. మేము 168 పరుగులను ఈజీగా ఛేదిస్తాం అనుకున్నాం. కానీ గుజరాత్ బౌలర్లు పిచ్ పరిస్థితులను చాలా బాగా ఉపయోగించుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో వారు చూపించిన బౌలింగ్ అత్యుత్తమ టీ20 బౌలింగ్‌లలో ఒకటి’ అని కమిన్స్ కొనియాడాడు.

Tags:    

Similar News