చివరి బంతి వరకు ఉత్కంఠ.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి!
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ థ్రిల్లర్‌ను అందించింది.
చివరి బంతి వరకు ఉత్కంఠ.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి!
India A vs Sri Lanka A: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ థ్రిల్లర్‌ను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయడంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో లంకపై భారత్ గెలిచింది. ఆ ఓటమికి శ్రీలంక బదులు తీర్చుకుంది.
వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నా:
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16 పరుగులు చేసింది. భారత్ 10 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నా టీమిండియా ఓడిపోవడం విశేషం. వైభవ్ మూడు బంతుల్లో 6 రన్స్ చేశాడు. చివరి బంతికి ఒక రన్ కూడా చేయలేదు.
మ్యాచ్‌ను మలుపుతిప్పిన 10 పరుగుల పెనాల్టీ:
ఈ మ్యాచ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది భారత జట్టుకు విధించిన 10 పరుగుల పెనాల్టీ. శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత బ్యాటర్ విప్రాజ్ నిగమ్ పిచ్‌లోని డేంజర్ ఏరియాలో పదే పదే పరుగెత్తడంతో నిబంధనల ప్రకారం భారత జట్టుకు 10 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో శ్రీలంక తమ ఛేదనను 10/0 స్కోరుతో ప్రారంభించింది. చివరికి మ్యాచ్ టైగా ముగిసిన నేపథ్యంలో ఈ 10 పరుగుల పెనాల్టీనే భారత ఓటమికి ప్రధాన కారణమైందా? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సదీర సమరవిక్రమ అద్భుత పోరాటం:
266 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ‘ఎ’ జట్టుకు సదీర సమరవిక్రమ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతడికి నిరోషన్ డిక్వెల్లా (37), వనుజ సహన్ (25), అవిష్క ఫెర్నాండో (22) విలువైన సహకారం అందించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, సుర్యాంశ్ చెరో వికెట్ సాధించారు.
కష్టాల్లో నుంచి ఆదుకున్న సుర్యాంశ్, విప్రాజ్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11) త్వరగా ఔటయ్యారు. కెప్టెన్ తిలక్ వర్మ (23), వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (37) కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 125 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడిన భారత్‌ను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సుర్యాంశ్ షెడ్జే, విప్రాజ్ నిగమ్ గట్టెక్కించారు. సుర్యాంశ్ 66 బంతుల్లో 72 పరుగులు చేయగా.. విప్రాజ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును పోరాడే స్కోరుకు అందించారు. శ్రీలంక బౌలర్లలో విజయకాంత్, షిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, సహన్, ముతులన్, వనుజా సహన్ తలో వికెట్ తీశారు.
హీరోగా నిలిచినా.. విలన్‌గా మారిన విప్రాజ్:
ఈ మ్యాచ్‌లో విప్రాజ్ నిగమ్ బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి, బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా తీసి ఆకట్టుకున్నాడు. అయితే అదే విప్రాజ్ చేసిన నిబంధనల ఉల్లంఘన కారణంగా భారత జట్టుకు 10 పరుగుల పెనాల్టీ పడింది. చివరకు అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయడంతో.. మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఓటమికి కారణమైన ఆటగాడిగా అతడు నిలిచిపోయాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక ‘ఎ’ సూపర్ ఓవర్‌లో విజయం సాధించగా, ఇండియా ‘ఎ’ మాత్రం పెనాల్టీ పరుగుల బాధను మిగిల్చుకుంటూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.