IND-W vs PAK-W : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. పాకిస్తాన్‌పై టీం ఇండియా ఘన విజయం
IND-W vs PAK-W : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది. స్మృతి మంధాన 68 రన్స్ చేయగా, దీప్తి శర్మ 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించింది.
IND-W vs PAK-W
IND-W vs PAK-W : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల క్రీడాకారులు అదిరిపోయే ప్రదర్శనతో టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తమ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ చిత్తు చేసింది. వన్ సైడెడ్ గా సాగిన ఈ పోరులో టీమిండియా 64 పరుగుల భారీ తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ గెలుపుతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్ 7వ సారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన పాకిస్తాన్‌పై తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడింది. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ 68 రన్స్ చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ 2022లో కూడా ఇదే మైదానంలో స్మృతి పాక్‌పై అద్భుతంగా ఆడి గెలిపించింది, ఇప్పుడు అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 రన్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్ వేగంగా 34 రన్స్ చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు.
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి కేవలం ఒక వికెట్ నష్టానికి 50 రన్స్ చేసి భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించారు. అయితే ఆ సమయంలో భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ రంగంలోకి దిగి పాక్ బ్యాటర్లను తన స్పిన్ జాలంలో పడేసింది. వరుస వికెట్లు తీస్తూ పాక్ పతనాన్ని శాసించింది. మరోవైపు యంగ్ ప్లేయర్ శ్రీ చరణి (3/21), షెఫాలీ వర్మ (1/22) కూడా పాక్‌ను కోలుకోకుండా చేశారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ ఫాతిమా సనాను షెఫాలీ వర్మ డకౌట్ (0) చేసి పెద్ద దెబ్బ కొట్టింది. చివరికి 17వ ఓవర్లోనే దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ 106 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కేవలం 4 ఓవర్లలో 10 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు (5/10) పడగొట్టి పాక్ నడుం విరిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధికంగా 166 వికెట్లు తీసిన ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. ఇంగ్లాండ్ పర్యటనలో అంతకుముందు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి ఫామ్ కోసం ఇబ్బంది పడిన దీప్తి.. ఈ మ్యాచ్‌తో మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవడం భారత జట్టుకు పెద్ద సానుకూలాంశం.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కంటే కూడా జట్టులోని కొందరు కీలక ఆటగాళ్లు మళ్లీ ఫామ్‌లోకి రావడం భారత మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ వరల్డ్ కప్‌కు ముందు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పరుగుల కోసం చాలా ఇబ్బంది పడింది, కానీ ఈ మ్యాచ్‌లో 68 రన్స్ చేసి తానేంటో నిరూపించుకుంది. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా ఫామ్ లేమితో సతమతమవుతోంది. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 34 రన్స్ చేసి తాను పాత ఫామ్‌లోకి వచ్చేసానని హింట్ ఇచ్చింది. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఫామ్‌లోకి రావడంతో రాబోయే మ్యాచ్‌ల్లో టీం ఇండియా మరింత బలంగా బరిలోకి దిగనుంది.