Hardik Pandya:10 కోట్లతో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్స్.. హార్దిక్ కోసం ముంబైకి సీఎస్‌కే బంపర్ ఆఫర్!

Hardik Pandya Trade ahead of IPL 2027 Trade. ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2026-07-26 13:28 GMT

Hardik Pandya: 10 కోట్లతో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్స్.. హార్దిక్ కోసం ముంబైకి సీఎస్‌కే బంపర్ ఆఫర్!

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు 7 ప్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా రేసులో ఉంది. హార్దిక్‌ను తీసుకునేందుకు చెన్నై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందట. ఈ ట్రేడింగ్ డీల్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ తొలుత ఆయుష్ మాత్రేతో పాటు కొంత నగదును ఆశించగా.. సీఎస్‌కే మాత్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం.

జట్టు భవిష్యత్తుకు కీలక ఆటగాడిగా ఆయుష్ మాత్రే:

ఆయుష్ మాత్రేను ఇచ్చేందుకు సీఎస్‌కే నిరాకరించడానికి ఓ కారణం లేకపోలేదు. అతడిని జట్టు భవిష్యత్తుకు కీలక ఆటగాడిగా భావిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 180 స్ట్రైక్ రేట్‌తో రాణించిన 19 ఏళ్ల మాత్రేను తమ జట్టు భవిష్యత్తు పునర్నిర్మాణానికి కీలకమైన ఆటగాడిగా ముంబై భావిస్తోంది. అయితే తమ భవిష్యత్తు ఆశాకిరణమైన మాత్రేను వదులుకోవడానికి చెన్నై యాజమాన్యం నిరాకరిస్తోంది. మాత్రేను జట్టులోనే ఉంచుకోవాలనే పట్టుదలతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ముంబైకి మరొక సంచలన ఆఫర్‌ను ప్రతిపాదించిందని కొన్ని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.

10 కోట్లతో పాటు ఇద్దరు స్టార్ ప్లేయర్స్:

ఆయుష్ మాత్రేకు ప్రత్యామ్నాయంగా స్టార్ ప్లేయర్స్ శివం దూబె, డెవాల్డ్ బ్రెవిస్‌లతో పాటు రూ. 10 కోట్ల నగదును ముంబైకి చెన్నై ఆఫర్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ గనుక పూర్తయితే.. ఈ ఆఫర్ మొత్తం విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందని, ఇది ముంబై ఇండియన్స్‌కు భారీ ఆఫర్‌గా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత క్రికెట్‌లో పేస్ బౌలింగ్ చేయగల మిడిల్ ఆర్డర్ ఆల్‌రౌండర్ దొరకడం చాలా అరుదు. పైగా ఫారిన్ ప్లేయర్ కోటాతో సంబంధం లేకుండా లభించే హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్ కోసం చెన్నై ఈ స్థాయి రేటు పెట్టడం గమనార్హం. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ కేవలం 206 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. ప్రస్తుత ఫామ్ కంటే అతడిలోని ప్రతిభనే నమ్మి చెన్నై ఈ ఆఫర్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హార్దిక్‌ను దక్కించుకోవడానికి చుస్తున్న కేకేఆర్:

ప్రస్తుతానికి ఇరు జట్ల మధ్య అధికారిక ఒప్పందం ఏదీ కుదరలేదు. ఒకవేళ చెన్నై, ముంబైల మధ్య ఈ చర్చలు విఫలమైతే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వంటి ఇతర ఫ్రాంచైజీలు కూడా హార్దిక్‌ను దక్కించుకోవడానికి చుస్తున్నాయట. ప్రస్తుతం ట్రేడ్ పరిస్థితులను అన్ని ప్రాంఛైజీలు నిశితంగా గమనిస్తున్నాయని సమాచారం. మిడిల్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు హార్దిక్‌ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. మొత్తానికి హార్దిక్ ట్రేడ్ వ్యవహారం ఐపీఎల్ 2027కు ముందు ఆసక్తికర అంశంగా మారింది. మరి హార్దిక్‌ను ఏ ప్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News