Vaibhav Sooryavanshi: వైభవ్‌ సూర్యవంశీ.. ఇకపై బౌలర్‌గా కూడా!

Vaibhav Sooryavanshi: బ్యాటింగ్‌లో చెలరేగుతున్న వైభవ్‌ను ఇకపై బౌలర్‌గా కూడా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోందట.

Update: 2026-07-25 11:57 GMT

Vaibhav Sooryavanshi: వైభవ్‌ సూర్యవంశీ.. ఇకపై బౌలర్‌గా కూడా!

Vaibhav Sooryavanshi: జింబాబ్వేతో తొలి టీ20లో అద్భుతమైన అర్ధశతకంతో భారత్‌కు ఘన విజయం అందించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రిచర్డ్ నగరవ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 4, 4 బాదిన బుడ్డోడు.. చివరి బంతికి ముజరబానికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

9 బంతుల్లో 20 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌లో చెలరేగుతున్న వైభవ్‌ను ఇకపై బౌలర్‌గా కూడా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునీల్ జోషి తెలిపాడు. జింబాబ్వేతో రెండో టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీని భవిష్యత్తులో బ్యాటర్‌గా మాత్రమే కాకుండా బౌలర్‌గా కూడా జట్టుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయని సునీల్ జోషి వెల్లడించాడు. 'ముందుగా వైభవ్ బ్యాటింగ్ గురించే మాట్లాడాలి. అతడు అసాధారణంగా ఆడుతున్నాడు. హరారే అతడికి ఎంతో ప్రత్యేకమైన వేదిక. అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో ఇక్కడే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

తొలి టీ20లోనూ తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. అయితే వైభవ్‌ను భవిష్యత్తులో బౌలింగ్ ఆప్షన్‌గా కూడా తీర్చిదిద్దాలని భారత జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో సమయం దొరికినప్పుడల్లా అతడి బౌలింగ్‌పై ప్రత్యేకంగా పనిచేస్తాము. అతడు బౌలింగ్‌లో మెరుగుపడితే ఆ అంశంపై కూడా త్వరగా దృష్టి సారిస్తాం' అని జోషి పేర్కొన్నాడు.

యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను హార్దిక్ పాండ్యా లేదా శివమ్ దూబేతో పోల్చడం సరికాదని సునీల్ జోషి అభిప్రాయపడ్డాడు. ప్రతి ఆటగాడికి తనదైన ప్రయాణం ఉంటుందని, షెడ్గే భారత జట్టులో తన స్థానాన్ని సంపాదించుకునే దశలో ఉన్నాడని చెప్పాడు. అతడిలో మంచి ప్రతిభ ఉందని, టీ20 క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాడని తెలిపాడు.

టీమిండియాలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల ఆటగాళ్లు పెరుగుతున్నారని జోషి వెల్లడించాడు. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో చాలా మెరుగయ్యాడని, తిలక్ వర్మ కూడా మంచి ప్రత్యామ్నాయ స్పిన్ బౌలర్ అని పేర్కొన్నాడు. వీరితో తరచూ మాట్లాడుతూ.. తక్కువ పరుగులు ఇవ్వడం, ఎక్కువ డాట్ బాల్స్ వేయడం, ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నామని సునీల్ జోషి వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీ తొలి టీ20లో చెలరేగిన విషయం తెలిసిందే. 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా బుడ్డోడు రికార్డుల్లో నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

రెండో టీ20లో భారత్ 7 ఓవర్లకు 61/2 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (8; 8 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (20; 9 బంతుల్లో) ఔటయ్యారు. ముజరబాని, రిచర్డ్ నగరవ తలో వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News