ZIM vs IND: తొలిసారి టాస్ ఓడిన భారత్.. ఒక్క మ్యాచ్‌కే అశోక్ అవుట్.. మరొకరు అరంగేట్రం!

ZIM vs IND: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ప్రారంభమైంది.

Update: 2026-07-25 11:41 GMT

ZIM vs IND: తొలిసారి టాస్ ఓడిన భారత్.. ఒక్క మ్యాచ్‌కే అశోక్ అవుట్.. మరొకరు అరంగేట్రం!

ZIM vs IND: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన జింబాబ్వే.. రెండో టీ20లో గెలిచి సిరీస్ సమయం చేయాలని చూస్తోంది.

ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టులో ఒకే ఒక్క మార్పు చోటుచేసుకుంది. తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన పేసర్ అశోక్ శర్మ స్థానంలో మరో పేసర్ యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు యశ్‌ ఠాకూర్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే అశోక్ ఎందుకు ఆడడం లేదో కెప్టెన్ వెల్లడించలేదు.

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే మిడిల్ ఆర్డర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు జింబాబ్వే జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

టాస్ సందర్భంగా మాట్లాడిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం అని వెల్లడించాడు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి పిచ్ భిన్నంగా కనిపిస్తోందని, వికెట్ అంతగా స్టికీగా లేకపోవడంతో బౌన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసినా.. అదంతా మరిచి ఈ మ్యాచ్ పైనే దృష్టి పెట్టాలని డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులకు సూచించినట్లు తెలిపాడు. జట్టులో ఎంతో ప్రతిభ ఉందని, ప్రతి ఒక్కరూ సరైన ప్రణాళికతో ఆడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని శ్రేయస్ పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. హరారేలో శీతాకాల పరిస్థితుల కారణంగా ఆరంభంలో పిచ్ పేసర్లకు కొంత సహకారం అందిస్తుందని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. తొలి మ్యాచ్తో పోలిస్తే ఈసారి వికెట్ మెరుగ్గా కనిపిస్తోందని, అయినప్పటికీ కొత్త బంతితో తమ పేసర్లు త్వరగా వికెట్లు తీస్తే మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్సీ అందుకున్న తర్వాత శ్రేయాస్ అయ్యర్ వరుసగా ఎనిమిది టీ20 మ్యాచ్‌లలో టాస్ గెలిచాడు. తొలిసారి అతడు టాస్ ఓడిపోయాడు.

తుది జట్లు:

భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.

జింబాబ్వే: బ్రియాన్ బెనెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మద్వీర, మారుమని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, ముజారబాని.

Tags:    

Similar News