Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. 46 బంతుల్లో 103 రన్స్.. టీమిండియాకు కొత్త సూపర్ స్టార్!
Vaibhav Sooryavanshi Shines with 103 Powerplay Runs. జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఫామ్‌తో అదరగొడుతున్నాడు.
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. 46 బంతుల్లో 103 రన్స్.. టీమిండియాకు కొత్త సూపర్ స్టార్!
Vaibhav Sooryavanshi: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. మొదటి టీ20లో హాఫ్ సెంచరీ బాదిన బుడ్డోడు.. మూడో టీ20లో కూడా అర్ధ శతకం బాదాడు. ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుడ్డోడు.. ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ టీమిండియా టాప్ ఆర్డర్‌కు కొత్త బలంగా మారాడు. మరోవైపు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం వరుస వైఫల్యాలతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య పోలికలు ఇప్పుడు భారత జట్టులో చర్చనీయాంశంగా మారాయి.
పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ల స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో తొలి ఆరు ఓవర్లలో (పవర్ ప్లే) బుడ్డోడు 46 బంతులు ఎదుర్కొని 103 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే వికెట్ కోల్పోయిన వైభవ్ 223.91 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద పారించాడు. దూకుడైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ భారత జట్టుకు మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. ఈ సిరీస్ తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లోనే 20 పరుగులు చేసి దూకుడును కొనసాగించాడు. ఇక మూడో టీ20లో మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో 49 బంతుల్లో 81 పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు ఆడిన తీరు చూస్తే.. భారత జట్టుకు భవిష్యత్తులో స్టార్ ఓపెనర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో 20 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ వికెట్ కోల్పోయిన అతడి స్ట్రైక్‌రేట్ కేవలం 55 మాత్రమే. ముఖ్యంగా జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా పవర్‌ప్లేలో 35 బంతుల్లో 49 పరుగులు చేసి ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 140 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు.
జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ హిట్ అయ్యారు. భారీగా రన్స్ చేస్తూ టీమిండియాకు మంచి ఆరంభాలు ఇచ్చారు. అభిషేక్ శర్మ మాత్రం పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో హాఫ్ సెంచరీ మినహా.. ఇటీవలి సిరీస్‌లలో (ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే) రన్స్ చేయలేదు. దాంతో అభిషేక్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. సంజు శాంసన్‌ను మరలా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ దూకుడు, ఇషాన్ కిషన్ నిలకడ, అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ విభాగంలో వైభవ్ తన స్థానాన్ని మరింత బలపరుచుకోగా, అభిషేక్ శర్మ మాత్రం తన స్థానం నిలబెట్టుకోవాలంటే త్వరగా ఫామ్‌లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైభవ్ చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, దూకుడు చూస్తే టీమిండియాకు మరో భవిష్యత్ సూపర్ స్టార్ దొరికినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.