BCCI: టీమిండియాలో విబేధాలు.. గంభీర్‌ను లెక్కచేయని సీనియర్స్.. బీసీసీఐ పెద్దల వరకు పంచాయితీ!
Senior India Players Reportedly Bypass Gambhir: భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
BCCI: టీమిండియాలో విబేధాలు.. గంభీర్‌ను లెక్కచేయని సీనియర్స్.. బీసీసీఐ పెద్దల వరకు పంచాయితీ!
Senior India Players Reportedly Bypass Gambhir: భారత జట్టు 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాలను ప్రారంభిస్తున్న వేళ.. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు జట్టు ప్రణాళికలు, నాయకత్వం, సీనియర్ ఆటగాళ్ల పాత్రలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీంఇండియాలో అంతర్గతంగా ముదురుతున్న విభేదాలు, అస్పష్టతలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. వన్డే క్రికెట్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వన్డేల్లో గౌతీ మార్క్ ఇపటివరకు కనపడలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చలు జట్టు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. భారత జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు తమ 2027 ప్రపంచ కప్ అవకాశాలపై స్పష్టత కోసం నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ విషయంలో కోచ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ప్లేయర్స్ నేరుగా బీసీసీఐ పెద్దలను కలిశారు. గంభీర్, అగార్కర్‌లతో కొందరు ఆటగాళ్లకు విబేధాలు వచ్చాయని తెలుస్తోంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి వన్డే భవిష్యత్తుపై సందేహాలు కొనసాగుతున్నాయి. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఆలోచనలు కూడా ఈ చర్చలకు కారణమయ్యాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ.. మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన దశలో లేనని స్పష్టం చేశాడు. మరోవైపు రోహిత్ వన్డేల్లో తన ఆటతీరును కొంతమేర మార్చుకుని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
మెగా టోర్నీ విషయంలో గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం, సీనియర్ ఆటగాళ్ల మధ్య ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన లేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. 'శుభ్‌మన్ గిల్ జట్టులో మరింత బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. టెస్టులు, టీ20ల్లో సక్సెస్ అందుకున్న గంభీర్.. ఇప్పటివరకు వన్డే ప్రణాళికల్లో మాత్రం జోక్యం చేసుకోలేదు. పరిస్థితులు సవ్యంగా సాగేందుకు అవకాశం ఇచ్చాడు' అని ఆ అధికారి పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో వెల్లడించింది. 'ఇప్పుడిప్పుడే ప్రపంచ కప్ సన్నాహకాలపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో గంభీర్, గిల్ తమ ఆలోచనలను స్పష్టంగా జట్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన సీనియర్ ఆటగాళ్లకు జట్టులో వారి పాత్ర ఏమిటి, వచ్చే 16 నెలల ప్రణాళిక ఏమిటి అనే విషయాలను స్పష్టంగా తెలియజేయడం చాలా ముఖ్యం' అని ఆయన అభిప్రాయపడ్డారు.
విరాట్ కోహ్లీ ఈ ఏడాది నవంబర్‌లో 38 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టనుండగా.. రోహిత్ శర్మ ఇప్పటికే 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. కింగ్ ఫిట్‌నెస్, ఫామ్ విషయంలో ఎలాంటి డోకా లేదు. రో-కోలు ఇద్దరు వన్డే ప్రపంచ కప్ గెలవాలనే లక్ష్యంతో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిని గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ సహా జట్టు యాజమాన్యం ఎలా డీల్ చేస్తుందన్న దానిపైనే భారత జట్టు ప్రపంచ కప్ ఆశలు నిలిచి ఉన్నాయి.