Litton Das: మేం గన్స్ మధ్యనే మ్యాచ్‌లు ఆడాం.. భారత్‌కు మేమెందుకు బయపడతాం!
Litton Das on T20 World Cup 2026 Exit. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన విషయం తెలిసిందే.
Litton Das: మేం గన్స్ మధ్యనే మ్యాచ్‌లు ఆడాం.. భారత్‌కు మేమెందుకు బయపడతాం!
Litton Das: భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన విషయం తెలిసిందే. భారత్‌లో భద్రతా పరిస్థితులు సరిగా లేవనే కారణంతో ప్రపంచ కప్‌లో పాల్గొనకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆటగాళ్లను ఆదేశించింది. దాంతో మెగా టోర్నీ నుంచి బంగ్లా తప్పుకుంది. టోర్నీకి ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌లో చోటుచేసుకున్న వివాదంపై ఆ జట్టు టీ20 కెప్టెన్ లిటన్ దాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ కోసం భారత్ వెళ్లకూడదనే నిర్ణయం పూర్తిగా బోర్డు పెద్దలే తీసుకున్నారని స్పష్టం చేశాడు. ప్లేయర్స్ అందరం టోర్నీలో ఆడాలని కోరుకున్నామని, భారత్‌లో ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లిటన్ దాస్ స్పష్టం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలుమార్లు భద్రతపై హామీలు ఇచ్చినా.. బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి బంగ్లాదేశ్ టోర్నీకి దూరమవగా.. ఆ స్థానంలో స్కాట్లాండ్ పాల్గొంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన లిటన్ దాస్.. 'టోర్నీకి ముందు మమ్మల్ని బీసీబీ అధికారులు సమావేశానికి పిలిచారు. మేము టీ తాగుతూ చర్చిస్తామని అనుకున్నాం. అక్కడ మమ్మల్ని మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడిగారు. ఆటగాళ్లుగా మేము ఏం కోరుకుంటాం?.. ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకున్నాం అని చెప్పాం. అయితే భారత్‌లో భద్రత లేదని మాకు చెప్పారు' అని లిట్టన్ వివరించాడు.
పాకిస్థాన్‌లో తమకు ఎదురైన పరిస్థితులను గుర్తుచేస్తూ లిటన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము పాకిస్థాన్‌లో కూడా క్రికెట్ ఆడాం. అక్కడ మా గదుల బయట తుపాకులతో భద్రతా సిబ్బంది నిలబడేవారు. దానికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇంకేముంటుంది?. పాకిస్థాన్‌లో ఆడగలిగితే.. భారత్‌లో ఎందుకు ఆడలేము? అని ప్రశ్నించాము. భారత్‌లో ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాం. అధికారులు వద్దని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా బీసీబీదే' అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై జనవరిలో వివాదం చెలరేగిన సమయంలో లిటన్ బహిరంగంగా స్పందించడానికి నిరాకరించాడు. 'మేము ప్రపంచ కప్ ఆడతామో లేదో కూడా స్పష్టత లేదు. మొత్తం బంగ్లాదేశ్ అనిశ్చితిలో ఉంది. ఈ విషయంపై మాట్లాడటం నాకు సురక్షితం కాదు' అని అప్పట్లో వ్యాఖ్యానించాడు.
2015లో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసిన లిటన్ దాస్.. అదే ఏడాది దక్షిణాఫ్రికాపై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రారంభంలో బ్యాటర్‌గా ఆడిన అతడు.. 2017 నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టాడు. 2018 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌పై సెంచరీ సాధించి ఓటమి పాలైనప్పటికీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. అలాగే 2020లో జింబాబ్వేపై 143 బంతుల్లో 176 పరుగులు చేసి బంగ్లాదేశ్ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. లిటన్ దాస్ తాజా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ప్రపంచ కప్ బహిష్కరణ నిర్ణయంపై కొత్త చర్చకు దారితీశాయి.