Amavasya: అరుదైన కలయిక.. అమావాస్య రోజునే సూర్యగ్రహణం...పితృదోషాలకు నేటితో విముక్తి
అమావాస్య సూర్యగ్రహణం ఒకేరోజు కావడంతో..ఈరోజు పితృదేవతలను స్మరించుకొని వారికి పితృతర్పణాలు విడువటం వలన దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Amavasya: జ్యోతిష్య, ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 2026 సంవత్సరంలో ఆగస్టు 12న అమావాస్య తిథి నాడే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుండటం ఒక దివ్య అరుదైన యోగంగా పండితులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి సూర్యగ్రహణం అమావాస్య నాడే సంభవిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ పవిత్ర దినాన పితృదేవతలను స్మరించి తిల తర్పణాలు వదలడం ద్వారా జాతకంలోని తీవ్ర పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
గ్రహణ ప్రభావం... విదేశాల్లో దృశ్యరూపం
ఈ ఏడాది సంభవించే ఈ చివరి సూర్యగ్రహణం సంపూర్ణంగా ఏర్పడుతోంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. స్పెయిన్, రష్యా వంటి దేశాల్లో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో పాక్షికంగా గోచరిస్తుంది. మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి శాస్త్రరీత్యా భారతీయులకు సూతక కాల నియమాలు లేదా ఆలయాల మూసివేత నేరుగా వర్తించవు. అయినప్పటికీ, ఆధ్యాత్మిక శుద్ధి కోసం జపాలు, తర్పణాలు ఆచరించడం శ్రేయస్కరం.
గ్రహణ కాలంలో పాటించాల్సిన నియమాలు, పరిహారాలు
హిందూ సంప్రదాయంలో గ్రహణ సమయంలో దేవతా శక్తులు క్షీణించి ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో కొన్ని కఠిన నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. గ్రహణ సమయంలో కత్తులు, కత్తెర్లు వంటి పదునైన వస్తువులను వాడకూడదు. గోళ్లు, జుట్టు కత్తిరించుకోకూడదు. దేవుని విగ్రహాలను లేదా పూజా పటాలను తాకరాదు. వంటగదికి సంబంధించిన పనులకు దూరంగా ఉండాలి. అంతేకాదు, గ్రహణానికి ముందే ఇళ్లలోని తాగునీరు, వండిన ఆహార పదార్థాలలో గరిక (దర్భలు) వేసి ఉంచాలి. ఇక గ్రహణ సమయంలో సూర్య మంత్రాలు, గాయత్రీ మంత్రం పఠించడం వల్ల మనస్శాంతి, పుణ్యఫలం లభిస్తాయి. గ్రహణం ముగిసిన వెంటనే ప్రవహించే నదిలో లేదా ఇంట్లో తలస్నానం చేసి పేదలకు శక్తి కొద్దీ దానధర్మాలు చేయాలి.
పితృదేవతల తిల తర్పణ మహత్యం
అమావాస్య, సూర్యగ్రహణం ఒకే రోజున కలసిరావడం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనది. ఈ పవిత్ర సమయంలో దక్షిణ దిశగా నిలబడి నల్ల నువ్వులతో పితృదేవతలకు అర్ఘ్యం లేదా తిల తర్పణాలు సమర్పిస్తే, వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల అనుగ్రహం లభిస్తే కుటుంబంలో ఆటంకాలు తొలగి సకల ఐశ్వర్యాలు వర్షిస్తాయని భక్తుల విశ్వాసం.