Lion's Gate Portal:లయన్‌ గేట్‌ పోర్టల్‌ రహస్యం... మేనిఫెస్టేషన్‌పై ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్న సత్యాలు

విశ్వం నుంచి వచ్చే శక్తివంతమైన కాస్మిక్‌ తరంగాలను అందిపుచ్చుకునేందుకు సంకల్పధ్యానం చేయడానికి ఆగస్టు 12 వరకు గడువు ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీనినే లయన్‌ గేట్‌ పోర్టల్‌ అని పిలుస్తారు.

Update: 2026-08-10 02:53 GMT

Lion's Gate Portal: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆగస్టు మాసానికి ఒక విలక్షణమైన, పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. విశ్వం నుండి దివ్యమైన సానుకూల శక్తులు భూమిపైకి ప్రవహించే అత్యంత శక్తివంతమైన సమయంగా 'లయన్ గేట్ పోర్టల్' కాలాన్ని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. సాధారణంగా చాలామంది ఆగస్టు 8వ తేదీని మాత్రమే లయన్ గేట్ పోర్టల్‌గా భావిస్తుంటారు. సంఖ్యాశాస్త్రంలో అంతం లేని సమృద్ధికి ప్రతీకగా నిలిచే 8 సంఖ్య, 2026 సంవత్సరంలో మరిన్ని దివ్య శక్తులను సంతరించుకుంది. అయితే ఈ ఆధ్యాత్మిక ద్వారాలు కేవలం ఒక్క రోజుతో ముగిసిపోవుని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

పోర్టల్ కాలక్రమం ... ఆగస్టు 12 వరకు అవకాశం

ఈ లయన్ గేట్ పోర్టల్ దివ్య ప్రక్రియ జులై 26న అధికారికంగా ప్రారంభమై, ఆగస్టు 8న దాని శక్తి పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ పవిత్ర కాలం ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 8వ తేదీన మేనిఫెస్టేషన్ చేయడం మరచిపోయిన వారికి, ఈ ఆగస్టు 12 వరకు తమ కోరికలను, సంకల్పాలను విశ్వానికి నివేదించడానికి అత్యంత అనుకూలమైన సమయంగా చెబుతున్నారు. దీనికి ఇంకా రెండు రోజుల గడువు ఉంది. కాబట్టి ఈ రెండు రోజుల్లో సంకల్పధ్యానం చేసుకోవచ్చు.

సంకల్ప సిద్ధికి పాటించాల్సిన ఆధ్యాత్మిక సూత్రాలు

విశ్వం నుంచి వచ్చే దివ్య శక్తులను ఆకర్షించి, మన కోరికలను నెరవేర్చుకోవడానికి ఆధ్యాత్మిక పండితులు కొన్ని పద్దతులు సూచిస్తున్నారు. ఒక తెల్లటి కాగితంపై మనలో దాగున్న ప్రతికూల ఆలోచనలు, భయాలు, ఆత్మవిశ్వాస లోపాలను స్పష్టంగా రాయాలి. ఆ తర్వాత ఆ కాగితాన్ని కాల్చి బూడిద చేయడం ద్వారా మీలోని నకారాత్మక శక్తి నశిస్తుంది. అదేవిధంగా నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు, ఆరాలోని మలినాలు తొలగిపోతాయి. అనంతరం, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శరీరం పవిత్రమైందని మనసులో స్మరించుకోవాలి. దీని వలన శరీరం పవిత్రతత అవుతుంది. స్నానం తర్వాత మనస్సుకు ప్రశాంతతనిచ్చే తీపి పానీయం తాగి, ప్రకృతి సమతుల్యతను సూచించే 432 హెర్ట్జ్ పౌనఃపున్య ధ్వనులను లేదా ఆధ్యాత్మిక సంగీతాన్ని వినడం ద్వారా నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. అలాగే, సాధించాలనుకునే 8 ముఖ్యమైన లక్ష్యాలను లేదా కోరికలను ఒక కాగితంపై స్పష్టంగా రాసి, అద్దం ముందు ఉంచాలి. కాగితంలో రాసిన సంకల్పాన్ని 8 రోజుల పాటు ప్రతిరోజూ పూర్తి నమ్మకంతో వాటిని బిగ్గరగా చదవాలి. ఆ తర్వాత ఆ కాగితాన్ని పూజా మందిరంలో భద్రపరుచుకోవాలి. మనసులో దృఢమైన విశ్వాసం, స్వయం కృషి తోడైతే లయన్ గేట్ పోర్టల్ ద్వారా ప్రసరించే విశ్వ శక్తి మన కలలను నిశ్చయంగా నిజం చేస్తుందని పండితులు చెబుతున్నారు. విశ్వానికి అనంతమైన శక్తి ఉంటుంది. నిరంతరం ఆ శక్తి తరంగాలను విడుదల చేస్తూనే ఉంటుంది. దానిని అందిపుచ్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.  

Tags:    

Similar News