Varalakshmi Vratam 2026: వరలక్ష్మీ వ్రతం... దోరగ్రంథిలో 9 దారాలు తొమ్మిది ముడులే ఎందుకుంటాయి? ఎవరు ఎలా ధరించాలి?
శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచారిస్తారు. ఈ వ్రతం రోజున స్వయంగా తోరాలు తయారు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
Varalakshmi Vratam 2026: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. 2026 ఆగస్టు 21న శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ పూజలో అమ్మవారి రూపం ఎంత ముఖ్యమో, పీఠంపై ఉంచే 'తోరం' కూడా అంతే ప్రధానమైనది. 'దోర' అంటే దారం, 'గ్రంథి' అంటే ముడి అని అర్థం. కేవలం పసుపు దారంగా కనిపించే ఈ తోరం వెనుక 9 సంఖ్యకు చెందిన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది.
తోరం తయారీ విధానం... పవిత్ర సోపానాలు
తోరాన్ని సంతానోత్పత్తి, సౌభాగ్య సంకేతంగా భావిస్తారు. దీనిని సిద్ధం చేసే విధానం అత్యంత ప్రాముఖ్యమైనది. సుచిగా 9 పత్తి దారాల నూలును తీసుకోవాలి. పసుపు కలిపిన దివ్య జలంలో ఈ దారాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం, ఈ తడిసిన దారాలను నీడలోనే పవిత్రమైన ప్రదేశంలో ఆరనివ్వాలి. ఇలా ఆరిన పవిత్రమైన తొమ్మిది దారాలను కలిపి ఒక దారంగా పేనాలి. సమాన దూరాలు ఉండేలా 9 ముడులను వేయాలి. తొమ్మిది దారాలు సమానంగా, సమానదూరంలో ముడులు వేయడం వలన దోరగ్రంథి తయారవుతుంది. ఇలా తయారైన దోరగ్రంథిని పూజలో ఉంచి పూజిస్తారు.
తొమ్మిది ముడుల రహస్యం
తోరంలోని దారాలకు ముడులు వేస్తారు. ఈ తొమ్మిది ముడులు శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్కో అనుగ్రహానికి, మానవ జీవిత లక్ష్యాలకు సంకేతంగా నిలుస్తాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, నిత్య సౌభాగ్యం, జ్ఞానసిద్ధి, పరిపూర్ణ శాంతికి చిహ్నంగా ముడులు ఉంటాయి.
ఎవరు ఎలా ధరించాలి?
అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత తోరానికి పుష్పాలు అలంకరించి, పూజించి ధరించాలి. ఇలా షోడశోపేతంగా అమ్మవారిని పూజించిన తరువాత ముత్తైయిదువులు కుడిచేతికి పసుపుతోరం ధరించాలి. అంతేకాదు, మెడలో పొంగునూలును కూడా ధరించాలి. అయితే, వివాహం కావలసిన అమ్మాయిలు, బాలికలైతే కుడిచేతికి తోరం మాత్రమే ధరించాలి. తోరం ధరించే సమయంలో బధ్నామి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదమ్, పుత్ర పౌత్రాభి వృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే అనే శ్లోకాన్ని పఠించాలి.
తోరం తొలగించే నియమం
వరలక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఈ కంకణాన్ని దానంతట అది తెగిపోయే వరకు చేతికే ఉంచుకోవాలి. ఒకవేళ తెగిపోతే దానిని కాలితో తొక్కకుండా ప్రవహించే నదిలో లేదా పవిత్రమైన చెట్టు మొదట్లో వేయాలి తప్ప చెత్తలో వేయకూడదు. ఇది కేవలం దారం కాదు... లక్ష్మీదేవి అభయహస్తం ఇచ్చే దివ్య రక్షాబంధనం కూడా. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున స్వతహాగా తోరాలను తయారు చేసుకొని, పూజలో ఉంచడం వలన పవిత్రత చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.