Darbha Grass Benefits: మనిషి జీవితాన్ని మార్చే దర్భలు... అదృష్టం ఉన్నవారింటే కొలువౌతుంది
దర్భలను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. దర్భలను ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలో తెలుసుకుందాం.
Darbha Grass Benefits: సనాతన హిందూ సంప్రదాయంలో తులసి, బిల్వపత్రాలతో పాటు అత్యంత పవిత్రమైనదిగా భావించేది 'దర్భ'. ఆధ్యాత్మికంగానూ, వైజ్ఞానికంగానూ మనిషి జీవన విధానాన్ని సుసంపన్నం చేసే అద్భుత శక్తులు ఈ దర్భల్లో దాగి ఉన్నాయి. త్రిమూర్తుల స్వరూపంగా, అగ్నిదేవుని అంశగా భావించే ఈ పవిత్ర దర్భలు ఉన్న చోట సకల ప్రతికూల శక్తులు తొలగిపోయి, లక్ష్మీకటాక్షం, ఐశ్వర్యం కొలువుదీరుతాయని ధార్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విశేషాలు
శాస్త్ర ప్రకారం దర్భలను సంస్కృతంలో 'అగ్నిగర్భం' అని పిలుస్తారు. వీటి వెనుక ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దర్భలు శ్రీరాముని పాద స్పర్శచేత మరింత పునీతమయ్యాయి. దర్భలకు స్వతహాగా ఉష్ణశక్తి, జలాలను శుద్ధి చేసే శక్తి ఎక్కువ. గ్రహణ కాలంలో ఆహార, పానీయాల్లో దర్భలను వేయడం ద్వారా విషక్రిములు, నెగెటివ్ ఎనర్జీ నశిస్తాయి. అడుగు భాగం నుండి కొన వరకు ఒకేలా ఉంటే వాటిని పురుష దర్భలని, పైభాగంలో మందంగా ఉంటే స్త్రీ దర్భలని, అడుగు భాగంలో మందంగా ఉంటే నపుంసక దర్భలని విభజించారు. అంతేకాదు, ఆలయాల్లో సంప్రోక్షణ సమయంలో కలశాలలో పవిత్ర లోహాలతో పాటు దర్భలను ఉపయోగిస్తారు. శిల్పశాస్త్రం ప్రకారం రాగి విగ్రహాలను బూడిద, దర్భలతో శుభ్రపరచడం వల్ల వాటిలోని మంత్రశక్తి తగ్గకుండా నిలిచి ఉంటుంది.
కార్యాలను బట్టి దర్భల వినియోగ సంఖ్య
ఏ రకమైన వైదిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా దర్భల సంఖ్యకు ఒక పక్కా నియమం ఉంది. ప్రేత లేదా ప్రతికూల శక్తుల నివారణకోసం ఒక్క దర్భను మాత్రమే ఉపయోగిస్తారు. అయితే, శుభకార్యాల్లో రెండు దర్భలు, అశుభ లేదా పితృకార్యాల్లో మూడు దర్భలు, దేవతా కార్యాలలో నాలుగు దర్భలను నిష్టతో వినియోగిస్తారు. ఏ పూజ, జపం, హోమం లేదా దానధర్మాలు చేసినా చేతి ఉంగరపు వేలికి దర్భతో చేసిన 'పవిత్రం' ధరించడం విధి. మన వేలిలో ఉండే కఫనాడిని శుభ్రపరిచి శారీరక ఆరోగ్యాన్ని అందించే శక్తి ఈ పవిత్ర దర్భ ఉంగరానికి ఉంది.
దర్భలను ఏ రోజు కోస్తే ఎంతకాలం వాడాలి?
మనం తెంచిన రోజును బట్టి దర్భలలో శక్తి నిలిచి ఉండే కాలపరిమితి మారుతుందని పండితులు చెబుతున్నారు. ఆదివారం దర్భలను తెంచి తీసుకొస్తే వారం పాటు వాడుకోవచ్చు. అదే పౌర్ణమి రోజున తీసుకొస్తే 15 రోజులు, అమావాస్యనాడు తీసుకొస్తే నెలరోజులు, భాద్రపద మాసంలో తీసుకొస్తే ఆరునెలల పాటు, శ్రావణమాసంలో కోసి తీసుకొచ్చిన దర్బలను ఏడాదిపాటు పవిత్రంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ, పితృదేవతల కార్యాల కోసం తీసుకొస్తే వాటిని అదేరోజున ఉపయోగించాలని పెద్దలు సూచిస్తున్నారు. ఇక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్దిని ప్రసాదించే దర్భలను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉంచుకోవడం శుభకరమని పండితులు చెబుతున్నారు.