Bearded Ram: శ్రీరాముడు గడ్డంతో కనిపించే ఏకైక ఆలయం..ఎక్కడుందంటే
Bearded Ram: ఓడిశాలోని నాయగఢ్ జిల్లాలో శ్రీరాముడు గడ్డంతో కనిపిస్తాడు. దాని వెనుక ఒక కథ ఉంది. ఈ ఆలయం 263 ఏళ్ల నాటిదని చెబుతారు.
Bearded Ram
Bearded Ram: మనకు శ్రీరాముడు అనగానే గడ్డం లేకుండా ఉండడమే ఎక్కడైనా కనిపిస్తుంది. కానీ ఒక ఆలయంలో గడ్డంతో శ్రీరాముడు, లక్ష్మణుడు పూజలందుకుంటూ ఉంటారు. ఆ ప్రసిద్ధ రఘునాథ్‌జీ ఆలయం ఒడిశాలోని నయగఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడ, శ్రీరాముడు మరియు లక్ష్మణుడు గడ్డాలు, మీసాలతో ఉంటారు. ఇద్దరికీ జడలు కట్టిన జుట్టు కూడా ఉంటుంది. సీతామాత ముఖం నిటారుగా కాకుండా కొద్దిగా వంగి ఉంటుంది, ఆమె తన ప్రభువైన శ్రీరాముని పాదాల వైపు చూస్తూ ఉంటుంది.
263 ఏళ్ల ప్రాచీన దేవాలయం..
సుమారు 263 సంవత్సరాల క్రితం, ఈ ఆలయ నిర్మాణ సమయంలో, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత విగ్రహాలను వేప చెక్కతో చెక్కి ప్రతిష్టించారు. అప్పటి నుండి ఈ విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ అద్వితీయమైన విగ్రహాలు నీటి వలన గానీ, ఏ విధమైన అలంకరణ వలన గానీ పాడవలేదు. బహుశా దేశంలో ఇంత అద్భుతమైన, విశిష్టమైన ఆలయం మరొకటి ఉండకపోవచ్చు.
వైభవంగా శ్రీరామనవమి..
ప్రధాన పురోహితుడు రంజన్ మహాపాత్ర దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వేషాలు ధరిస్తారని ఆయన వివరించారు. వాటిలో అరణ్యవాసి, చిత్రకూటం, తడ్కా వధ, అహల్య రక్షణ, ధనుస్సు విలుకాడు వంటివి ఉన్నాయి. తొమ్మిదవ రోజున రామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున స్వామివారికి బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. రామనవమితో సహా సంవత్సరానికి ఐదుసార్లు స్వామివారికి బంగారు ఆభరణాలు అలంకరిస్తారు.
స్థల పురాణం ఇదే..
స్థానికులు చెప్పుకునే కథల ప్రకారం.. ఈ ప్రదేశంలో ఒకప్పుడు అత్రి ముని ఆశ్రమం ఉండేదట. రాముడు, లక్ష్మణుడు, సీతామాత తమ వనవాస సమయంలో ఇక్కడ బస చేసినప్పుడు, అత్రి ముని వారి వస్త్రధారణకు ముగ్ధుడయ్యాడు. ఆయన శ్రీరామునితో, "మీ అరణ్యవాసి రూపం అద్భుతంగా ఉంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళవద్దు" అని అన్నారు. అప్పుడు శ్రీరాముడు, "రుషి వర్యా..దయచేసి మూడు శాలిగ్రామాలను ఇక్కడ ఉంచండి. మీరు నా ఈ రూపాన్ని స్మరించుకున్నప్పుడల్లా, ఈ శాలిగ్రామాలను చూడండి" అని చెప్పారట. తరువాత కాలంలో శాలిగ్రామాల ప్రదేశంలో అక్కడ వేప చెక్కలతో సీతారామలక్ష్మణ విగ్రహాలను చెక్కారని చెబుతారు. వనవాస సమయంలో రామ, లక్ష్మణులు గెడ్డం, మీసాలతో ఉండేవారని వాల్మీకి రామాయణంలో ఉంది. అందుకే ఇక్కడ రాములవారు, లక్ష్మణుడు గెడ్డంతో కనిపిస్తారని చెబుతారు.
ఈ ఆలయం కళింగ వాస్తుశైలిలో నిర్మించారు. భద్రా మండపం, నాట్ మండపం, దర్శనా మండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది. ఈ మూడు మండపాలలో ప్రతి దాని పైన 15 కిలోగ్రాముల బంగారు కలశాలు ప్రతిష్టించారు. అందువల్ల, దీనిని బంగారు కలశాల ప్రాంతం అని కూడా పిలుస్తారు.
బంగారు కలశాలతో మొదటి ఆలయం ఇదే..
బంగారు కలశాలతో అలంకరించబడిన మొట్టమొదటి ఆలయం ఇదే. వాటి పైన ఒక చక్రం కూడా ప్రతిష్టించారు. మరే ఇతర ఆలయంలోనూ ఈవిధంగా లేదు.
భువనేశ్వర్ నుండి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ పూజలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు దేవునికి వివిధ నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.