Sri Rama Navami 2026: రాములోరి ఆదర్శం.. శ్రీరామనవమి మనకిచ్చే సందేశం!
Sri Rama Navami 2026: రాములోరి కళ్యాణం.. పుట్టినరోజు ఒకేరోజు జరుపుకునే పవిత్రమైన రోజు శ్రీరామనవమి. రామచంద్రుని ధర్మ బద్ధ జీవితాన్ని తలుచుకోవలసిన రోజు.
Sri Rama Navami 2026:
Sri Rama Navami 2026: విష్ణుమూర్తి పది అవతారాల్లోనూ మనిషి జీవితాన్ని అతి దగ్గరగా ఆవిష్కరించింది రామావతారమే. ఏ అవతారమైనా ఎక్కడో అక్కడ తాను దైవమని చెబుతుంది. కానీ శ్రీరామునిగా విష్ణుమూర్తి ఏ సందర్భంలోనూ తానూ దైవం అని చెప్పలేదు. ధర్మం మనిషిని ఎలా కాపాడుతుంది.. ధర్మబద్ధంగా జీవించడం ఎలా? ధర్మాన్ని నమ్ముకుంటే అది మనల్ని ఎలా కాపాడుతుంది. అసలు మానవునిగా పుట్టిన వారి బాధ్యతలు ఏమిటి? పెద్దలతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా వ్యవహరించాలి. స్నేహితునికి అండగా ఎలా నిలబడాలి? తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం ఇవ్వాలి? ఇలా ఒక్కటేమిటి మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని శ్రీరాముని జీవితంలో మనం చూడగలం. ఆయన చరిత్ర నుంచి నేర్చుకోగలం. రేపు (మార్చి 27) శ్రీరామనవమి. శ్రీరాముని జన్మదినం. అలాగే ఆయన పెళ్లి రోజు కూడా. ఇలాంటి రోజున శ్రీరాముని తలుచుకోవడం. రామచరితను మననం చేసుకోవడం మనసుకు ఉల్లాసాన్నివ్వడమే కాదు జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను ధర్మబద్ధంగా ఎదుర్కునే ధైర్యం కూడా ఇస్తుంది.
మహోన్నత ఘట్టం..
రామావతారం.. భగవంతుడు మానవ రూపం ధరించి ధర్మాన్ని స్థాపించిన ఒక మహోన్నత ఘట్టం. అయోధ్యను పరిపాలించిన దశరథ మహారాజు పిల్లల కోసం చేసిన 'పుత్రకామేష్టి యాగం' అగ్నిగుండంలో వచ్చిన దివ్య పాయసం ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. విషుమూర్తి తన దైవిక శక్తులను త్యజించి, తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా నిలుస్తూ ఒక సాధారణ మానవుడిగా జీవించాడు. ఈ పవిత్రమైన రామ నవమి రోజున ఉపవాసం ఉండి, శ్రీరాముని నామాన్ని జపించడం వల్ల జీవితంలో క్రమశిక్షణ, మనశ్శాంతి లభించి, ఆశీర్వాదాలు కూడా కలుగుతాయని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
రామ అవతారం ప్రత్యేకత
ఆశీర్వాదాలను ప్రసాదించే రామ నవమిని హిందూమతంలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. మహావిష్ణువు అవతారాలలో రామ అవతారం అత్యంత విశిష్టమైనది. పుణ్యమైనది. ఈ అవతారంలోనే స్వామి తన దైవిక శక్తులను త్యజించి, తల్లిదండ్రులకు కుమారుడైన ఒక సాధారణ మానవునిగా జీవించారు. దీని ద్వారా మానవ జీవితంలో కర్తవ్యాలు, నైతిక విలువలు, ధర్మం ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. శ్రీరామ నవమి రోజు ఆయన పుట్టుకు సంబంధించిన కథను మననం చేసుకుందాం.
దశరథ మహారాజు దుఃఖం
అయోధ్య రాజ్యాన్ని దశరథుడు అనే రాజు పరిపాలించాడు. దిక్కులు సంఖ్యా దిశలుగా విభజించబడ్డాయి. అతను పాతాళ లోకం, ఆకాశంతో సహా మొత్తం 10 దిక్కులలో తన రథాన్ని సమర్థవంతంగా నడపగలిగాడు. అందుకే అతనికి 'దశరథ' అనే పేరు వచ్చింది. అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. అయితే, తన తర్వాత దేశాన్ని పరిపాలించడానికి సంతానం లేకపోవడంతో దశరథుడు చాలా ఆందోళన చెందాడు.
పుత్ర కామేష్టి యాగ అద్భుతం
దశరధుడు సంతానం పొందడం కోసం వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తాడు . ఆయన ఋష్యశృంగ అనే ఋషిని తీసుకువచ్చి, పుత్రకామేష్టి యాగం చేయమని చెబుతారు. ఋష్యశృంగముని వశిష్టుడు చెప్పిన దాని ప్రకారం యాగం చేశాడు. అప్పుడు యాగాగ్నిహోత్రం నుండి ఒక తేజోమయ రూపం ఉద్భవించింది. దాని చేతులలో ఒక బంగారు పాత్ర ఉంది. దానిలో పాల పానీయం ఉంది. ఆ రూపం దశరథునితో, “ఈ పానీయాన్ని నీ భార్యలకు పంచిపెట్టు. వారికి నలుగురు పిల్లలు పుడతారు” అని చెప్పి, ఆ తర్వాత అదృశ్యమైంది. రామునితో సహా నలుగురి జననానికి కారణమైన దైవిక సంఘటనగా దీనిని పరిగణిస్తారు. అలా సౌమిత్రి గర్భాన పుట్టిన శ్రీరాముడు ఆదర్శవంతుడైన కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, పాలకుడిగా ఇప్పటికీ మనందరికీ దిక్సూచి అయ్యాడు.
రామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఈ సంఘటనకు గుర్తుగా రామ నవమిని జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, రామ దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తారు. జీవితంలో ధర్మాన్ని, నైతికతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. రామ నామాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. శ్రీరామనవమి ఒక పండుగ కాదు. మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక మార్గం. మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది తరచి చూసుకునే ఒక అవకాశం. శ్రీరాముని కళ్యాణ వైభోగాన్ని చూసి.. రాములోరి జీవితాన్ని తలుచుకుని.. పానకం తీర్థంగా.. వడపప్పు ప్రసాదంగా స్వీకరించి ధర్మబద్ధ జీవితం గడపాలనే ప్రతిజ్ఞ చేసుకోవడమే శ్రీరామనవమి రోజు మన విధి.