Akshaya tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిది సరే.. కొనకూడనివి ఏంటో తెలుసా.?
Akshaya tritiya: భారతీయ సంప్రదాయాల్లో అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాలు, కొనుగోళ్లు అన్నీ శుభఫలితాలను ఇస్తాయని నమ్మకం ఉంది.
Akshaya tritiya
Akshaya tritiya: భారతీయ సంప్రదాయాల్లో అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాలు, కొనుగోళ్లు అన్నీ శుభఫలితాలను ఇస్తాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. మరి అక్షయతృతీయ రోజు కొనుకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 19న అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఈ రోజును హిందూ సంప్రదాయంలో అత్యంత శుభమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ పర్వదినం రోజున చాలా మంది తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి, మహావిష్ణువును పూజిస్తారు. దేవాలయాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. కొత్త పనులు, వ్యాపారాలు, పెట్టుబడులు ప్రారంభించడానికి కూడా ఈ రోజును మంచి సమయంగా భావిస్తారు.
ఈ రోజున ఎక్కువగా చేసే కొనుగోళ్లు
అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం శుభం అనే నమ్మకం వల్ల చాలా మంది ప్రత్యేకంగా షాపింగ్ చేస్తారు.
ముఖ్యంగా బంగారం, వెండి కొనడం చాలా సాధారణం. కొందరు కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. కొందరు ఇంటికి కొత్త వస్తువులు తెచ్చి దేవుడి గదిలో పెట్టి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం ఉంది.
అక్షయ తృతీయ రోజున కొనకూడని వస్తువులు
జ్యోతిష్య, వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పవిత్ర రోజున కొన్ని వస్తువులను కొనడం మంచిది కాదని చెబుతున్నారు. ఇనుప వస్తువులు కొనడం శుభకరం కాదని అంటారు. పదునైన వస్తువులు (కత్తులు, ఆయుధాలు వంటి వాటి కొనుగోలు) నివారించాలని సూచిస్తున్నారు. ముళ్లు ఉన్న మొక్కలు ఇంటికి తీసుకురావడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. నలుపు రంగు దుస్తులు కొనడం లేదా ధరించడం కూడా చాలా మంది నివారిస్తారు.
అలాగే స్టీల్ పాత్రలు కొనడం కూడా ఈ రోజున చేయకూడదని కొందరు సూచిస్తున్నారు.
ఈ రోజున పాటించాల్సిన కొన్ని నియమాలు
అక్షయ తృతీయ రోజున కొన్ని ఆచారాలు పాటించడం శుభం అంటారు. ఈ రోజున మాంసాహారం తినకుండా ఉండడం మంచిదని భావిస్తారు. ఇతరులతో వివాదాలు, గొడవలు చేయకుండా ఉండాలని పెద్దలు సూచిస్తారు.
పూజలు చేసి, దానం చేయడం, మంచి పనులు చేయడం ఈ రోజున శుభఫలితాలను ఇస్తాయని విశ్వాసం.
గమనిక: ఈ సమాచారంలో పేర్కొన్న అంశాలు సంప్రదాయాలు, మత విశ్వాసాల ఆధారంగా మాత్రమే అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.